బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేయలేదని అభిప్రాయపడ్డారు. బిహార్ ఎన్నికలకు సంబంధించి పీటీఐ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు సుశీల్ మోదీ.
రాష్ట్రీయ జనతా దళ్ నేతృత్వంలోని 'మహాకూటమి'.. అధికార ఎన్డీఏకి ఎలాంటి పోటీ ఇవ్వలేదని అన్నారు. ప్రతిపక్ష కూటమి విశ్వసనీయతను కూడా కోల్పోయిందని ఎద్దేవా చేశారు.
"రాష్ట్రంలో ఏ పార్టీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. భాజపా, జేడీయూ, ఆర్జేడీ త్రిముఖ శక్తులుగా ఉన్న రాష్ట్రంలో ఇది అసాధ్యం. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో ఐక్యంగా పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తాం."
- సుశీల్ మోదీ, భాజపా సీనియర్ నేత
అంతర్గత వివాదాలపై..
భాజపా, జేడీయూ మధ్య బంధం 1996 నుంచి కొనసాగుతోందని మోదీ తెలిపారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని ఈ కూటమి అందించిందని, రెండు పార్టీల మధ్య సమన్వయం చక్కగా కుదిరిందని చెప్పారు. అయితే 2014 లోక్సభ ఎన్నికలు, 2015 శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడటంపై వివరణ ఇచ్చారు మోదీ.