మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కరవైన వేళ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేనపై ఆరోపణలు గుప్పించారు. మహాకూటమి విజయం సాధిస్తే... దేవేంద్ర ఫడణవీస్ సీఎం అవుతారని ఎన్నికల ప్రచార సభల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ, తాను పలుమార్లు చెప్పినట్లు ఏఎన్ఐ ముఖాముఖిలో షా గుర్తుచేశారు.
"భాజపా, శివసేన కూటమి అధికారంలోకి వస్తే దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని శాసనసభ ఎన్నికల ప్రచారంలో నేను వంద సార్లు చెప్పాను. ప్రధానమంత్రి అనేక సార్లు చెప్పారు. స్వయంగా దేవేంద్ర ఫడణవీస్ కూడా చాలా సార్లు వెల్లడించారు. అప్పుడు ఈ వ్యాఖ్యలను ఎవరూ వ్యతిరేకించలేదు. శివసేన నుంచి ఇప్పుడు వచ్చిన డిమాండ్లపై మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. తగిన సమయంలో భాజపా దీని గురించి ఆలోచిస్తుంది. రాష్ట్రపతి పాలన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం కేవలం ప్రజల సానుభూతి పొందేందుకు తప్ప మరొకటి కాదు.