లాక్డౌన్ 4.0లో కార్యాలయాలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో పని ప్రదేశాల్లో కరోనా నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఒకటి, రెండు కేసులు నమోదైన కారణంగా కార్యాలయ భవనాన్ని పూర్తిగా మూసివేయాల్సిన అవసరం లేదని తెలిపింది. నిబంధనల మేరకు కార్యాలయ భవనాన్ని క్రిమిసంహారకాలతో శుద్ధి చేసిన అనంతరం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. వైరస్ సోకిన వ్యక్తి గత 48 గంటల్లో తిరిగిన ప్రదేశాలన్నింటినీ శుభ్రం చేయాలని పేర్కొంది.
ఒకవేళ కార్యాలయ పరిధిలో కరోనా కేసుల సంఖ్య రెండు కంటే ఎక్కువ ఉంటే మాత్రం మొత్తం భవనాన్ని 48 గంటల పాటు మూసివేయాలని చెప్పింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఆ ప్రదేశం మొత్తాన్ని క్రిమిసంహారకాలతో శుద్ధి చేసి అధికారుల అనుమతి పొందిన తర్వాతే తిరిగి తెరవాలని నిర్దేశించింది. ఈ సమయంలో ఉద్యోగులు ఇంచి నుంచి పని చేసేలా చూడాలని సూచించింది.