తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త చట్టాలతో 'వినియోగదారుని' కష్టాలు తీరేనా! - వినియోగదారుల సమస్యలు

సరళీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో వినియోగదారులు కీలకంగా మారారు. దీంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా వినియోగదారులు నష్టపోకుండా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నేటికీ చాలామంది వినియోగదారులకు తమ హక్కులపై సరైన అవగాహన లేదు. ముఖ్యంగా గ్రామీణ వినియోగదారులు మోసపోతున్నారు. వీటిని నివారించడానికి ప్రభుత్వం నుంచి చర్యలు చేపట్టడం ఆవశ్యకం. ప్రభుత్వ నిధులతో కొనసాగే సంస్థల ద్వారా వినియోగదారుల అవగాహన సదస్సులు నిర్వహించడం, విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో కార్యశాలలు ఏర్పాటు చేసి వినియోగదారుల హక్కులు, వాటి ప్రాధాన్యంపై వివరించడం వంటివి చేసినప్పుడు వినియోగదారుల పరిరక్షణ చట్టాలకు సాంత్వన కలుగుతుంది.

No matter how many laws are enforced for the rights of consumers, the better
కొత్త చట్టాలతో వినియోగదారుల కష్టాలు తీరేనా!

By

Published : Dec 25, 2019, 8:41 AM IST

ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో వినియోగదారులు కీలకంగా మారారు. వస్తూత్పత్తుల కొనుగోలు పెద్దయెత్తున జరుగుతుండటంతో వారు మోసపోకుండా, నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. వారి హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టడంతోపాటు, వాటిపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతా పెరిగింది. నేటికీ చాలామంది వినియోగదారులకు తమ హక్కులపై సరైన అవగాహన లేదు. ఫలితంగా మోసపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 1986 నాటి వినియోగదారుల సంరక్షణ చట్టంలో మార్పులు తీసుకువస్తూ గత ఏడాది కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీనికి ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదిన రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది. వినియోగదారుల హక్కుల రక్షణ, అనైతిక వ్యాపారాలను అరికట్టడం, సత్వర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ, ఆన్‌లైన్‌ క్రయవిక్రయాలను, వ్యాపార సంస్థలను ఇందులో చేర్చి చట్ట పరిధిని విస్తృతం చేశారు. వినియోగదారులకు సాధికారత కల్పించడంలో ఈ చట్టాన్ని ఓ మైలురాయిగా పేర్కొనవచ్చు. అమెరికాలో 'యూఎస్‌ ఫెడరేషన్‌ ట్రేడ్‌ కమిషన్‌', ఆస్ట్రేలియాలో 'ఆస్ట్రేలియన్‌ కన్స్యూమర్‌ అండ్‌ కమిషన్‌' వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తునాయి.

జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కమిషన్లు

వినియోగదారుల వేదికల స్థానంలో కమిషన్లను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అనైతిక వ్యాపారాలను నిరోధించడానికి ఈ చట్టం కింద కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీని ఏర్పాటు చేశారు. ఇది ముఖ్య కమిషనరు, ఉప కమిషనర్ల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. దర్యాప్తు విభాగం డైరెక్టర్‌ జనరల్‌ పర్యవేక్షణలో ఉంటుంది. దీనికి సోదాలు, జప్తు చేసే అధికారం ఉంది. అనైతిక వ్యాపారం కొనసాగిస్తున్నా, హక్కులకు భంగం కలిగినట్లు ఫిర్యాదు అందితే కలెక్టరు ద్వారా నివేదిక కోరవచ్చు. వినియోగదారుల కమిషన్ల పరిదినీ కొత్త చట్టం నిర్ణయించింది. కేసుల స్వీకరణకు సంబంధించి జిల్లా కమిషన్‌ పరిధి కోటి రూపాయల వరకు, రాష్ట్ర కమిషన్‌ పరిధి కోటి నుంచి పది కోట్ల రూపాయల వరకు ఉంటుంది. జాతీయ కమిషన్‌ పది కోట్ల రూపాయలకు పైగా విలువ ఉన్న కేసులను విచారిస్తుంది. జిల్లా కమిషన్‌ తీర్పుపై రాష్ట్ర కమిషన్‌లో, అక్కడ వెలువడే తీర్పుపై జాతీయ కమిషన్‌లో అప్పీలు చేసుకోవచ్చు. రాష్ట్ర కమిషన్‌కు తన తీర్పులను తాను పునస్సమీక్షించే అధికారం ఉంది. దీనివల్ల- తొందరపాటు నిర్ణయాలు ఏమైనా ఉంటే, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

శిక్షలు, జరిమానాలు

నియమ నిబంధనలను అతిక్రమించే వారికి భారీ జరిమానాలు విధిస్తారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చేవారికి, ప్రకటనలో పాల్గొన్న వ్యక్తులకు రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. మోసపూరిత ప్రకటనలో పాల్గొన్న ప్రముఖులు, ఇతర వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనకుండా నిషేధం విధించవచ్చు. కల్తీలకు పాల్పడటం ద్వారా ఏదైనా హాని కలిగితే ఆరు నెలల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా వేయవచ్చు. ఆదేశాలను అమలు చేయని పక్షంలో ఆరు నెలల వరకు జైలుశిక్ష, ఇరవై లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించే అధికారం ఉంది. వినియోగదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉత్పత్తిదారుడు, సేవలు అందించే వ్యక్తికి జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.

మధ్యవర్తిత్వ కేంద్రాలు

వివాదాల పరిష్కారం కోసం కొత్తగా మధ్యవర్తిత్వ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వినియోగదారులు తమ సమస్యలకు సత్వర పరిష్కారం పొందే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. నిర్దిష్ట గడువులోగా పరిష్కారం లభించని పక్షంలో జిల్లా స్థాయి కమిషన్‌ రాష్ట్ర, జాతీయ కమిషన్లను ఆశ్రయించవచ్చు. కొత్త చట్టం ప్రకారం వినియోగదారుడు ఎక్కడినుంచి అయినా తన సమస్యపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. మొత్తానికి, వినియోగదారుడికి మేలు కలిగే విధంగా చట్టాన్ని రూపొందించారు. 1986నాటి చట్టంలో గల 'వస్తువు' అనే పదానికి నిర్వచనాన్ని సవరించారు. కొత్త చట్టానికి మరింత పదును పెట్టారు.

నష్టపరిహారం

వినియోగదారులకు సేవలు అందించడంలో జాప్యం జరిగినా నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. లలిత్‌ కుమార్‌ వర్సెస్‌ కృష్ణ కేసులో ఈ మేరకు తీర్పు ప్రకటించారు. ఒప్పందం ప్రకారం నిర్దేశించిన సమయానికి నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చినందుకు నష్ట పరిహారం, వ్యాజ్య వ్యయం కింద మొత్తం 35 వేల రూపాయలు చెల్లించాలని ఈ కేసులో కమిషన్‌ ఆదేశించింది.

పాటించాల్సిన విధానాలు

వినియోగదారుల కేసుల పరిష్కార ప్రక్రియ నిర్ణీత కాలవ్యవధితో కూడినదై ఉండాలి. దీనివల్ల ఉత్పత్తిదారుడు, అమ్మకందారుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. చిన్నపిల్లలకు ఉద్దేశించిన హానికరమైన ఆహార ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలపై స్పష్టమైన నియంత్రణ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిధులతో కొనసాగే సంస్థల ద్వారా వినియోగదారుల అవగహన సదస్సులు నిర్వహించాలి. ముఖ్యంగా విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో కార్యశాలలు ఏర్పాటు చేసి వినియోగదారుల హక్కులు, వాటి ప్రాధాన్యంపై వివరించాలి. వస్తువుల నాణ్యతను నిర్ణయించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లయితే మేలు కలుగుతుంది. నిర్దేశించిన ప్రమాణాలను పరిశీలించిన తరవాత వస్తువులను మార్కెట్‌లోకి విడుదల చేయడం వల్ల వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. చట్టాల అమలుపై ప్రభుత్వాల చిత్తశుద్ధి, నిబద్ధతతోపాటు వినియోగదారుల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకం. స్థూలంగా చూస్తే వినియోగదారుల హక్కులకు పట్టం కట్టడంలో కొత్త చట్టం సానుకూలంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. వినియోగదారుల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం, తగిన నష్ట పరిహారం లభించినప్పుడే అతడు సంతృప్తి పొందుతాడు. ఎన్ని చట్టాలున్నా వాటిని సమర్థంగా అమలు చేసినప్పుడే మేలు కలుగుతుంది.

- డాక్టర్‌ ఎం.బుచ్చయ్య(రచయిత)

ABOUT THE AUTHOR

...view details