ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మొదటిసారిగా 1979 ఎన్నికలు జరిగాయి. అప్పటినుంచి.. 2014 ఎన్నికల వరకు ప్రాంతీయ పార్టీలదే అధికారం. ఒక్కసారి కూడా జాతీయ పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న భాజపా, కాంగ్రెస్‌లను దరిదాపుల్లోకీ రానీయకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి ప్రాంతీయ పార్టీలు.
''మేం జాతీయ పార్టీలను విశ్వసించం. సిక్కిం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే 371(ఎఫ్) ఆర్టికల్ రక్షణ కోసం ఇది ముఖ్యం.''
- డిలే బర్ఫుంగ్పా, సిక్కిం నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు
పోలింగ్ తేదీ | ఏప్రిల్ 11 |
లోక్‌సభ స్థానాలు | 1 |
అసెంబ్లీ స్థానాలు | 32 |
ఓటర్లు | 4, 23, 325 |
అధికార పక్షం | సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ |
ప్రధాన ప్రత్యర్థి | సిక్కిం క్రాంతికారి మోర్చా |
ఇక్కడ భాజపా కంటే కాంగ్రెస్ కొద్దిగా మెరుగు. 2004, 09 ఎన్నికల్లో జాతీయ పార్టీ భాజపాకు 0.34, 0.78 శాతం ఓట్లు పోలయ్యాయి. ఒక్క స్థానమూ గెలుపొందలేదు. కాంగ్రెస్‌కు ఓటు శాతం 20 దాటినా 2004లో వచ్చింది ఒకే ఒక్క సీటు. 2009లో అదీ లేదు. 32 శాసనసభ నియోజకవర్గాల్లోనూ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌దే విజయం.
2014 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ధాటికి భాజపా, కాంగ్రెస్‌ల ఓట్లశాతం మరింత పతనమైంది. ఒక్క చోటా నెగ్గలేదు. కాంగ్రెస్‌కు 1.4 శాతం ఓట్లు నమోదయ్యాయి. భాజపా.. కాంగ్రెస్‌లో సగం ఓటు శాతం పొందింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు... రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సత్తా ఏంటో.
మూడు సార్లు సీఎం కుర్చీలో భండారీ....
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలాకాలం ప్రత్యేక రాజ్యంగానే కొనసాగింది సిక్కిం. అనంతరం జరిగిన పరిణామాలతో 1975లో భారత్‌లో 22వ రాష్ట్రంగా మారింది.
సిక్కింలో మొట్టమొదటిసారిగా 1979 అక్టోబర్‌లో ఎన్నికలు జరిగాయి. నర్ బహాదుర్ భండారీ నేతృత్వంలోని సిక్కిం జనతా పరిషద్(ఎస్జేపీ) పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పోటీ చేసిన 31 స్థానాల్లో 16 గెల్చుకుంది. సిక్కిం కాంగ్రెస్ 11... సిక్కిం ప్రజాతంత్ర కాంగ్రెస్(ఎస్పీసీ) 4 స్థానాలకు పరిమితమయ్యాయి. భండారీ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
- అనంతరం ఎస్జేపీ కాంగ్రెస్‌లో విలీనమైంది. కానీ.. కొద్దికాలానికి సిక్కిం సంగ్రామ్ పరిషద్(ఎస్ఎస్పీ) అనే మరో కొత్త ప్రాంతీయ పార్టీ స్థాపించారు భండారీ.
- 1985లోనూ ఎస్ఎస్పీ ప్రభంజనం సృష్టించింది. 30 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. 1989 ఎన్నికల్లో ఏకంగా క్లీన్‌స్వీప్ చేసింది. భండారీ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
చామ్లింగ్ శకం మొదలు....
1990వ దశకంలో భండారీ ప్రజాదరణ మరుగునపడిపోయింది. ఈయన నాయకత్వంపై తిరుగుబాటు చేపట్టిన పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్) పార్టీని స్థాపించారు.