కాంగ్రెస్లో నాయకత్వ సంక్షోభం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టంచేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి పార్టీలో సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు. అంధులు కాని ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమవుతుందని పీటీఐ ముఖాముఖిలో వ్యాఖ్యానింంచారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉపఎన్నికల ఫలితాలపై కపిల్ సిబల్, చిదంబరం సహా పార్టీలోని సీనియర్ నేతలు కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖుర్షీద్ స్పందించారు. వారి సూచనలకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే మీడియా ముందుకెళ్లి చెప్పడాన్ని తప్పుబట్టారు. అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కాంగ్రెస్లో అవసరమైన వేదికలు ఉన్నాయని, బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అన్నారు.
"ఫలితాలపై చర్చ ఎప్పుడూ జరుగుతుంది. దానిపై ఎలాంటి సందేహం లేదు. తప్పు ఎక్కడ జరిగిందో నాయకత్వం గుర్తిస్తుంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది. అది సాధారణంగా జరిగేదే. దాని గురించి బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీ నాయకత్వం నా మాట వింటుంది. నాకు అవకాశం(అభిప్రాయాలు చెప్పేందుకు) వచ్చింది. వారికి(బహిరంగంగా విమర్శించేవారికి) కూడా అవకాశాలు లభిస్తాయి. అలాంటప్పుడు నాయకత్వం తమ మాట వినడం లేదనే ధోరణి ఎక్కడి నుంచి వస్తుంది."
-సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ సీనియర్ నేత