ఈశాన్య రాష్ట్రాల మండలి 68వ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ ప్రాంతాల అభివృద్ధికి నరేంద్ర మోదీ సర్కారు కట్టుబడి ఉందని తెలిపారు. 371వ అధికరణను కేంద్రం రద్దు చేస్తుందంటూ వస్తున్న వార్తలను తోసిపుచ్చారు షా. కొందరు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
"విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. 370 రద్దును వ్యతిరేకించే వారు తమ వైఖరిని తెలిపే స్వేచ్ఛ ఉంది. అదే అదునుగా తీసుకుని ఆర్టికల్ 371ని కూడా కేంద్రం రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను పార్లమెంటులో స్పష్టం చేశాను. తర్వాత తొలిసారి అసోం వచ్చాను. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఇక్కడున్నారు. ఆర్టికల్ 370, 371 మధ్య అంతరాన్ని వివరిస్తా. ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో తాత్కాలికంగా పొందుపరిచారు. 371 తాత్కాలికం కాదు. శాశ్వతం. ప్రత్యేక ప్రతిపత్తి. మోదీ, భాజపా సర్కారు ఆర్టికల్ 371ని ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని స్పష్టం చేస్తున్నా."