దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ .. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం ఆ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. గతమూడు రోజులుగా ఆ రాష్ట్రంలో ఒక్క కొవిడ్-19 పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటివరకు 41 మందికి వైరస్ సోకగా.. 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 13 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం తెలిపింది.
మహారాష్ట్ర, దిల్లీలో తీవ్రం
మరోవైపు మహారాష్ట్ర, దిల్లీలో కొవిడ్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 440 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 8,068కి పెరిగింది. వైరస్ బారినపడి మరో 19 మంది మృతిచెందగా.. మరణాల సంఖ్య 342 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,188 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దిల్లీలోనూ ఇవాళ కొత్తగా 293 మందికి వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో బాధితుల సంఖ్య 2,918 కు పెరిగింది. దేశరాజధానిలో ఇప్పటివరకు 54 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్లో ఒక్కరోజు వ్యవధిలో 230 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 3,301కు ఎగబాకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ ధాటికి 151 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 313 మంది డిశ్చార్జ్ అయ్యారు.