ఒడిశాలో నేడు విమానాలు బంద్, 220 రైళ్ల రద్దు ఫొని తుపాను పొంచి ఉన్న దృష్ట్యా ఒడిశా, బంగాల్‌లలో నేడు, రేపు (ఈ నెల 3, 4 తేదీల్లో) రైల్వే, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగనుంది. గత రెండు దశాబ్దాల్లోనే ఇది అత్యంత ప్రమాదకరమైన తుపానుగా భావిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కోల్‌కతా-చెన్నై రైల్వే మార్గంలోని సుమారు 220 రైళ్లు శనివారం వరకు నిలిచిపోనున్నాయి. మరోవైపు ఒడిశాలోని భువనేశ్వర్ విమానాశ్రయంలో శుక్రవారం అన్ని విమాన రాకపోకలు రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన నియంత్రణ మండలి (డీజీసీఏ) ప్రకటించింది.
కోల్‌కతా విమానాశ్రయం మూత
తుపాను వల్ల నేటి రాత్రి 9.30 గంటల నుంచి రేపటి సాయంత్రం 6 గంటల వరకు కోల్‌కతా విమానాశ్రయాన్ని మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఒడిశాలో తీరం దాటనున్న ఫొని
ఫొని తుపాను ఒడిశాలోని పూరికి దక్షిణాన ఉన్న గోపాల్పూర్-చాంద్‌బలి మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో సుమారు 170 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.
10 వేల గ్రామాలపై ప్రభావం
సుమారు 10 వేల గ్రామాలు, 52 పట్టణాలపై ఫొని తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా సుమారు 11.5 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 3.3 లక్షల మందిని జాతీయ విపత్తు నిర్వహణ దళం సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముందస్తు, సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఫొని తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ్ బంగ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని అధికారులు తెలియజేశారు.
ఇదీ చూడండి : ఆ ఒక్క మార్కు వచ్చి ఉంటే: సీబీఎస్ఈ టాపర్