తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మధ్యంతరం ఖాయం.. అబ్బే అలాంటిదేం లేదు' - జేడీఎస్

కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ జేడీఎస్​ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీంతో తాను అలా అనలేదని, కాంగ్రెస్​-జేడీఎస్​ మైత్రి కొనసాగుతుందని వివరణ ఇచ్చుకున్నారు గౌడ.

"కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు ఖాయం"

By

Published : Jun 22, 2019, 5:15 AM IST

Updated : Jun 22, 2019, 9:30 AM IST

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్- జేడీఎస్​ల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ నాయకుల పద్ధతి ఇందుకు కారణమని విమర్శించారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

"తొలుత కాంగ్రెస్‌ తమకు ఐదేళ్ల పాటు పూర్తి మద్దతిస్తానని చెప్పింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నాయకుల పద్ధతి చూస్తుంటే.. త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. పేరుకు మాత్రమే కుమారస్వామి సీఎంగా వ్యవహరిస్తున్నారు. పెత్తనం మొత్తం కాంగ్రెస్‌ చేతిలోనే ఉంది. పొత్తు సమయంలో కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయాలన్నింటినీ జేడీఎస్‌ అంగీకరించింది. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ జేడీఎస్ అభ్యర్థులకు కాంగ్రెస్ సంపూర్ణంగా సహకరించలేదు. హస్తం పార్టీ రోజురోజుకూ బలహీన పడుతోంది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైంది. సంకీర్ణ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేను. కానీ మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది."

- దేవేగౌడ, మాజీ ప్రధాని

ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపడం వల్ల కాసేపటికే వివరణ ఇచ్చుకున్నారు దేవేగౌడ. కాంగ్రెస్​-జేడీఎస్​ పొత్తు కొనసాగుతుందని, సంకీర్ణ ప్రభుత్వం చెక్కుచెదరదంటూ మాటమార్చారు. అందుకు తాను కృషి చేస్తానంటూ చెప్పారు.

ఇదీ చూడండి:కీలక నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్

Last Updated : Jun 22, 2019, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details