తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్షణానికో మలుపు తిరుగుతున్న 'మహా' రాజకీయాలు

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఓ వైపు రాష్ట్రపతి పాలన విధించగా, శివసేన మాత్రం అందుకు ససేమిరా అంటోంది. రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించింది. అయితే శివసేనకు మద్దతిచ్చే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్, ఎన్​సీపీ ప్రకటించాయి. భాజపా మాత్రం స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామని అంటోంది.

క్షణానికో మలుపు తిరుగుతున్న 'మహా' రాజకీయాలు

By

Published : Nov 12, 2019, 11:12 PM IST

Updated : Nov 13, 2019, 7:51 AM IST

క్షణానికో మలుపు తిరుగుతున్న 'మహా' రాజకీయాలు

మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. గవర్నర్​ భగత్​సింగ్​ కోశ్యారీ సిఫారసుతో రాష్ట్రపతిపాలన విధించినా.. శివసేన మాత్రం వెనక్కు తగ్గడం లేదు. గవర్నర్​ తమకు తగినంత గడువు ఇవ్వలేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే రాష్ట్రపతిపాలన విధింపును వ్యతిరేకిస్తూ మరో పిటిషన్​ను దాఖలు చేయడానికి సన్నద్ధమైంది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై రేపు విచారణ చేపట్టే అవకాశముంది.

నిర్ణయం తీసుకోలేదు..

ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ చర్చలు, ప్రయత్నాలు కొనసాగుతాయని మీడియా సమావేశంలో స్పష్టం చేశాయి కాంగ్రెస్​, ఎన్సీపీలు. శివసేనకు మద్దతు ఇవ్వడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాయి. సేన తొలిసారిగా సోమవారమే తమను సంప్రదించిందని తెలిపారు కాంగ్రెస్​ సీనియర్​ నేత అహ్మద్​ పటేల్​. మద్దతు విషయంలో మరిన్ని అంశాలపై స్పష్టత కోసం శివసేనతో చర్చలు జరగాల్సి ఉందని వెల్లడించారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్​ను ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి గవర్నర్ ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించింది.

సిద్ధాంతాలు వేరైనా ఓకే..

సిద్ధాంతాలు వేరైనప్పటికీ కాంగ్రెస్, ఎన్​సీపీలతో కలిసి పనిచేస్తామని శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే పేర్కొన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంపై మూడు పార్టీల మధ్య ఓ అవగాహన అవసరమే అని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం ఏర్పాటువిషయంలో.. కాంగ్రెస్, ఎన్​సీపీలతో తాము మొదటిసారిగా నవంబర్​ 11న చర్చలు జరిపామని ఉద్ధవ్​ ఠాక్రే స్పష్టం చేశారు.

స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం...

రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో.. ఇవాళ సాయంత్రం భాజపా కోర్​ కమిటీ సమావేశమైంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించింది. అయితే.. రాష్ట్రపతి పాలనకు శివసేన మొండివైఖరే కారణమని ఆరోపించారు భాజపా నేత సుధీర్​ ముంగంటీవార్​. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

20 రోజులైనా...

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపా, శివసేన కూటమి విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై వివాదంతో ఇరుపార్టీలు ప్రభుత్వం ఏర్పాటుచేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది.

ఇదీ చూడండి: 'ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు'

Last Updated : Nov 13, 2019, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details