శాస్త్రవిజ్ఞానం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కోల్‌కతా వేదికగా జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
"శాస్త్ర, సాంకేతికత లేకుండా అభివృద్ధి సాధించిన దేశం ప్రపంచంలో ఏదీ లేదు. శాస్త్రవిజ్ఞానంలో భారత్ ఎంతో సాధించింది. మనం ప్రపంచానికి అత్యుత్తమ శాస్త్రవేత్తలను అందించాం. మన చరిత్ర ఎంతో గౌరవం అందుకుంది. వర్తమానం శాస్త్ర సాంకేతికతతో నిండినది. భవిష్యత్తు కోసం మన బాధ్యత ఎంతో పెరిగింది. ఈ బాధ్యతలు ఎంతో గౌరవమైనవి. వీటిని నిర్వర్తించేందుకు శాస్త్ర సాంకేతికతతో ముందుకు సాగాల్సి ఉంది. ప్రభుత్వం నవ కల్పనలు, నవీన ఉత్పత్తుల తయారీకి వ్యవస్థాగతమైన సహకారం అందిస్తోంది. దేశంలో శాస్త్ర,సాంకేతిక రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన వాతావరణం ఎంతో ప్రభావమంతమైనదే కాక.. పేద ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి."