ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడే ప్రసక్తే లేదని చైనా పీఎల్ఏతో జరిగిన ఐదో దఫా కమాండర్ స్థాయి సైనిక చర్చల్లో భారత అధికారులు స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాంగాంగ్ సో సహా తూర్పు లద్దాఖ్‌లోని మరికొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల్లో సైన్యాన్ని వీలైనంత త్వరగా ఉపసంహరించాలని భారత అధికారులు కోరినట్లు స్పష్టం చేశాయి.
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వైపు ఉన్న మోల్డోలో ఇరుదేశాల సైనికాధికారులు ఆదివారం దాదాపు 11 గంటలపాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని అన్ని ప్రాంతాల్లో యథాతథ స్థితిని నెలకొల్పడమే ఇరుదేశాల సంబంధాలకు కీలకమని భారత సైన్యం.. చైనాకు స్పష్టం చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. బలగాలు పూర్తిగా ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలు పూర్తిగా ఉపసంహరించడం సహా ఉద్రిక్తతలు మరింత తగ్గించడానికి చేపట్టే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు స్పష్టం చేశారు.
ఆర్మీ చీఫ్‌కు చర్చల వివరాలు
చైనాతో చర్చల గురించి ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు సోమవారం ఉదయం వివరించినట్లు అధికార వర్గాల వెల్లడించాయి. అనంతరం సరిహద్దులో పరిస్థితిపై సీనియర్ మిలిటరీ అధికారులతో ఆర్మీ చీఫ్ చర్చ జరిపినట్లు తెలిపాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ సహా విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సైతం చర్చల సారాంశాన్ని వివరించినట్లు సమాచారం.
ఐదో విడత చర్చల్లో భారత్ తరపున హాజరైన బృందానికి లేహ్‌లోని 14వ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ అధ్యక్షత వహించారు. దక్షిణ షింజియాంగ్ మిలిటరీ రీజియన్ కమాండర్ మేజర్ జనరల్ లియూ లిన్ చైనా తరపున చర్చల్లో పాల్గొన్నారు. చివరిసారి జులై 14న జరిగిన కమాండర్ స్థాయి చర్చలు... సుమారు 15 గంటలపాటు కొనసాగాయి.
వెళ్లాల్సిందే
కొన్ని నెలలుగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునే ఉద్దేశంతో ఇరు దేశాలు గత నెలలో.. ఘర్షణ ప్రాంతాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు గల్వాన్ లోయ, ఇతర ప్రాంతాల నుంచి చైనా తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. పాంగాంగ్ వద్ద మాత్రం ఉపసంహరణ జరగలేదు. అక్కడి ఫింగర్-4 నుంచి ఫింగర్-8 ప్రాంతానికి చైనా సైనికులు వెళ్లాలని భారత్ స్పష్టంచేస్తోంది. అలాగే గోగ్రా ప్రాంతాల్లోనూ డ్రాగన్ తన ఉపసంహరణలను పూర్తి చేయలేదు.