కరోనా కారణంగా సమాజంలో వచ్చిన మార్పు భవిష్యత్తులో ఆరోగ్యంగా జీవించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా జీవితంలో ఓ అలవాటుగా మారుతుందని తెలిపారు. కరోనా వల్ల వచ్చిన మార్పు ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడుతుందని అన్నారు.
భారత్లో కరోనా కేసుల సంఖ్య పెరగుతున్నప్పటికీ ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్(స్థానికంగా ఒకరి ద్వారా మరొకరికి వ్యాపించే) దశకు చేరుకోలేదని చెప్పారు హర్ష వర్ధన్. కరోనాను నిలువరించేందుకు లాక్డౌన్ విధించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆర్థిక వ్యవస్థతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ ముఖ్యమని పేర్కొన్నారు. ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.