మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం పలు కీలక భేటీలు జరిగినప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. శివసేన నేత సంజయ్ రౌత్.. మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ అయ్యారు. సోనియా గాంధీతో దిల్లీలో సమావేశమయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు జరిపారు.
'భాజపాదే బాధ్యత'
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బాధ్యత భాజపాదేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తమ మద్దతుకోరలేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో.. దిల్లీ టెన్ జన్‌పథ్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు పవార్. కాంగ్రెస్- ఎన్సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో సోనియాతో పవార్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మాత్రమే సోనియాతో చర్చించినట్లు చెప్పారు పవార్. ప్రభుత్వ ఏర్పాటు అంశం చర్చకు రాలేదని.. త్వరలోనే మరోమారు భేటీ అవుతామన్నారు.
అనంతరం మీడియాతో సమావేశమయ్యారు పవార్. మహారాష్ట్ర ప్రజలు తమను ప్రతిపక్షంలో ఉండమని తీర్పునిచ్చారని పునరుద్ఘాటించారు. అయితే భవిష్యత్తు గురించి ముందుగా మాట్లాడలేమన్నారు.
గవర్నర్‌ను కలిసిన సంజయ్ రౌత్
ప్రభుత్వం ఏర్పాటుపై భాజపా-శివసేన మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీతో భేటీ అయ్యారు శివసేన సీనియర్ నేత సంజయ్‌రౌత్. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితికి సేన కారణం కాదని గవర్నర్‌కు వివరించినట్లు భేటీ అనంతరం తెలిపారు రౌత్. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన ఎంతమాత్రం అడ్డుకాదన్నారు. ఎవరికి మెజారిటీ ఉంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు.