రాజస్థాన్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట లభించింది. ఈనెల 24 వరకు పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు స్పీకర్‌కు సూచించింది. రాజస్థాన్ స్పీకర్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 24న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు వెల్లడించింది.
విప్ ధిక్కరించి శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరైన పైలట్ సహా 19మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా స్పీకర్ నోటీసులు జారీ చేశారు.
అయితే అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మాత్రమే విప్ వర్తిస్తుందని, స్పీకర్ జారీచేసిన నోటీసులు కొట్టివేయాలని పైలట్ వర్గం హైకోర్టుకు వెళ్లింది. ఈ అంశంపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. శాసన వ్యవస్థలో స్పీకరే సుప్రీం అని, ఆయన ఇచ్చిన నోటీసుల్లో కోర్టు జోక్యం తగదని స్పీకర్ తరపు న్యాయవాది వాదించారు. నోటీసులు జారీ చేయడానికి తగిన కారణాల్లేవని, సమాధానం ఇచ్చేందుకు కూడా తగిన సమయం ఇవ్వలేదని పైలట్ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాలు లిఖిత పూర్వకంగా వాదనలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. ఈనెల 24న తీర్పు వెలువరిస్తామని స్పష్టంచేసింది.
ఇదీ చూడండి: రాహుల్‌కు భాజపా 'విజయాల' కౌంటర్