తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాను నిర్ధరించే 2 ల్యాబ్​లు పనిచేస్తున్నాయిలా... - NIV scientists working ON CORONA TESTING

కరోనా వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ శాస్త్రవేత్తలు అనునిత్యం శ్రమిస్తున్నారు. 24 గంటలు పని చేస్తూ కచ్చితమైన ఫలితాలను రాబడుతున్నారు. వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదురైనా.. తమకు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. రోజంతా ప్రత్యేక రక్షణ దుస్తులను ధరించి కరోనా పరీక్షల్లో నిమగ్నమవుతున్న శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం.

NIV scientists
కరోనాను నిర్ధరించే 2 ల్యాబ్​లు పనిచేస్తున్నాయిలా...

By

Published : Mar 8, 2020, 6:04 PM IST

Updated : Mar 8, 2020, 7:00 PM IST

కరోనాను నిర్ధరించే 2 ల్యాబ్​లు పనిచేస్తున్నాయిలా...

దేశంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైరస్​ అనుమానిత కేసులూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్​ నిర్ధరణ కోసం శాస్త్రవేత్తలు అనునిత్యం శ్రమించాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా వందకుపైగా ప్రయోగశాలలు ఉన్నప్పటికీ.. అక్కడ వచ్చిన ఫలితాలను ధ్రువీకరించుకునేందుకు మహారాష్ట్ర, కేరళలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ (ఎన్​ఐవీ) కేంద్రాలకు నమూనాలు​ పంపుతున్నారు వేర్వేరు రాష్ట్రాల అధికారులు. వందల సంఖ్యలో వచ్చే సాంపిల్స్​ను పరీక్షించేందుకు వైరాలజీ కేంద్రాల్లోని శాస్త్రవేత్తలు 24/7 పని చేస్తున్నారు.

వైరాలజీ కేంద్రాల్లో చేపడుతున్న చర్యలు, తీసుకుంటున్న జాగ్రత్తలపై కీలక విషయాలు వెల్లడించారు ఐసీఎంఆర్​ ఈసీడీ-1 అధ్యక్షులు రామన్​ ఆర్​. గంగఖేద్కర్​.

" గడిచిన నెలరోజుల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 4,000 సాంపిల్స్​ను పరీక్షించాం. ప్రతి రోజు సగటున 25 సాంపిల్స్​కు​ ఎన్​ఐవీలో పరీక్షలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు 24 గంటలు పని చేస్తూ కచ్చితమైన ఫలితాల కోసం శ్రమిస్తున్నారు. ప్రధానంగా వైరస్​ సోకినట్లు ధ్రువీకరించుకోవటానికే ఎన్​ఐవీకి సాంపిల్స్ వస్తున్నాయి. వీటితో పాటు ప్రత్యేక అసైన్​మెంట్​ ఉంటోంది. ఉదాహరణకు వుహాన్​ లేదా జపాన్​ నుంచి వచ్చిన వారి సాంపిల్స్​ను పరీక్షించి, ఫలితాలను వారి దేశానికి పంపే విషయంలో ఎన్​ఐవీ ప్రధాన పాత్ర పోషిస్తోంది."

- రామన్​ ఆర్​ గంగఖేద్కర్​, ఐసీఎంఆర్​ ఈసీడీ-1 అధ్యక్షులు.

ల్యాబ్​లను సమన్వయం చేస్తూ..

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దేశంలోని అన్ని ప్రయోగశాలలను సమన్వయం చేస్తూ వైరస్​ నిర్ధరణలో వైరాలజీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు రామన్​. ప్రతి రోజు అనుబంధ ల్యాబ్​ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షల్లో కచ్చితత్వం కోసం 5 శాతం నెగటివ్​ సాంపిల్స్​ను మరోమారు పరీక్షించించి ధ్రువీకరించుకునేందుకు ఎన్​ఐవీకి పంపుతున్నారని తెలిపారు రామన్​.

ప్రత్యేక రక్షణ పరికరాలతో..

సాంపిల్స్​ను పరీక్షించే శాస్త్రవేత్తలు వ్యక్తిగత భద్రతలో భాగంగా ప్రత్యేక రక్షణ పరికరాలతో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన గౌన్లు, అద్దాలు, ఎన్​-95 మాస్క్​లను ధరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నిర్ధరణ కోసం సుమారు 10-24 గంటల సమయం పడుతున్నట్టు చెబుతున్నారు.

అప్రమత్తం..

దేశవ్యాప్తంగా 40 కేసులు నమోదు కావటం వల్ల కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సాంపిల్స్​ను పరీక్ష చేసేందుకు 52 ప్రయోగశాలతో పాటు 57 ల్యాబులను తీసుకునేందుకు ఏర్పాటు చేసింది. ఈనెల 6 నుంచి ఇప్పటి వరకు 3,404 మంది నుంచి 4,058 సాంపిల్స్​ సేకరించి ఈ ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి:'ఆ మహిళలకు మోదీ పాస్​వర్డ్​ చెప్పింది అందుకే...'

Last Updated : Mar 8, 2020, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details