తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ సీఎంగా నితీశ్​ కుమార్​ ప్రమాణస్వీకారం నేడే.. - bihar polls 2020

జేడీయూ అధినేత నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి ఉప ముఖ్యమంత్రిగా సుశీల్‌ మోదీ లేకుండానే ఆయన ప్రమాణం చేయనున్నారు. భాజపా తరఫున తార్​కిశోర్‌, రేణుదేవిలను ఉప ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nitish Kumar set to be sworn in as Bihar CM for 7th time
బిహార్​ సీఎంగా నితీశ్​ కుమార్​ ప్రమాణస్వీకారం నేడే..

By

Published : Nov 16, 2020, 5:05 AM IST

బిహార్​ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్నారు నితీశ్​ కుమార్​. ఆదివారం.. నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో తమ శాసనసభాపక్ష నేతగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్​ ‌సహా భాజపా అగ్రనేతలు, జేడీయూ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం రాజ్ భవన్‌లో గవర్నర్​ను కలిసిన నితీశ్ కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఆ తర్వాత నేడు సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో సోమవారం సాయంత్రం పట్నాలో నితీశ్ కుమార్‌ ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఏడోసారి బిహార్​ సీఎంగా నితీశ్​ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

డిప్యూటీ సీఎంగా ఎవరు..?

అయితే.. ఉప ముఖ్యమంత్రి పదవిపైనే ఉత్కంఠ నెలకొంది. సుశీల్​ కుమార్​ మోదీ స్థానంలో ఈసారి వేరొకరిని నియమించే అంశాన్ని భాజపా పరిశీలిస్తోంది. అందుకు అనుగుణంగా ఆదివారం భాజపా శాసనసభాపక్ష సమావేశ వేదికగా పావులు కదిలాయి. సుశీల్​ స్థానంలో.. బిహార్​ భాజపా శాసనసభాపక్ష నేతగా కతియార్​ ఎమ్మెల్యే తార్​కిశోర్​ ప్రసాద్​ను కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన పేరును సుశీల్​ కుమారే ప్రతిపాదించడం విశేషం. తార్​కిశోరే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల ప్రయోగం కూడా చేయాలని భాజపా భావిస్తోంది. అదే జరిగితే శాసనసభాపక్ష ఉపనేతగా ఎన్నికైన రేణుదేవికి డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలున్నాయి. 8 సార్లు గయ టౌన్​ నుంచి ఎన్నికైన ప్రేమ్​కుమార్​.. దళిత ఎమ్మెల్యే కామేశ్వర్​ చౌపల్​ పేర్లూ వినిపిస్తున్నాయి. నిజానికి సుశీల్​, నితీశ్​ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే 2024 లోక్​సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఉప ముఖ్యమంత్రిని నియమించాలన్న యోచనలో భాజపా ఉంది. అందుకే సుశీల్​ పేరుపై సందిగ్ధం కొనసాగుతోంది.

మెజారిటీ మంత్రి పదవులు భాజపాకే..!

ముఖ్యమంత్రి పదవికి నితీశ్​ ఎంపిక సాఫీగా సాగినా.. మంత్రిమండలిలో మెజారిటీ వాటా మాత్రం భాజపాకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో 74 సీట్లతో భాజపా.. ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ.. 71 నుంచి 43 సీట్లకు పడిపోయింది. ఎన్డీఏ కూటమిలోని మరో రెండు భాగస్వామ్య పార్టీలైన హిందూస్థానీ అవామ్​ మోర్చా(హెచ్​ఏఎం), వికాస్​శీల్​ ఇన్సాన్​ పార్టీ(వీఐపీ) తలో నాలుగు సీట్లు నెగ్గాయి. దీంతో ఎన్డీఏ కూటమి.. మెజారిటీ మార్కును దాటింది. భాజపాకు అత్యధిక మంత్రివర్గ సీట్లతో పాటు.. హెచ్​ఏఎం, వీఐపీ పార్టీలకూ మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details