'కామ్ కియా.. సమ్మాన్ దియా' "ఒకప్పుడు బిమారూ రాజ్యం. ఇప్పుడంతా సుభిక్షం. రెండు అంకెల వృద్ధితో కాగ్ మొదలు అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థల మన్ననలు పొందిన రాష్ట్రం".... కొద్దిరోజుల క్రితం వరకు అధికార జేడీయూ నేతలు చెప్పిన మాటలివి. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగాక లెక్క మారింది. వృద్ధి లెక్కలు వెనక్కి వెళ్లాయి. నితీశ్ కుమార్ ప్రజాకర్షణ శక్తే ప్రధానాంశమైంది. "సచ్ఛా హై... అచ్ఛా హై"(నిజాయితీనే మంచిది)... ఇది ఇప్పుడు జేడీయూ నినాదం. "ఛలో నితీశ్‌కే సాథ్"(పదండి నితీశ్‌తో కలిసి నడుద్దాం) ఉపశీర్షిక. ఇలాంటి పోస్టర్లు మరికొన్ని ఉన్నాయి. 'హమ్ కామ్ మే విశ్వాస్ హై'(మేం పనిని నమ్ముతాం), 'కామ్ కియా.. సమ్మాన్ దియా'(పని చేశాం.. గౌరవం పొందాం) వాటిపై కనిపించే నినాదాలు. ఇలా.... నితీశ్ కుమార్ వ్యక్తిత్వమే ముఖ్యాంశంగా ఓటర్ల ముందుకు వెళ్తోంది జేడీయూ.
"ఇది పోస్టర్ కాదు. అందులో పని చేశాం-గౌరవం పొందాం అనే మాటను చూడొచ్చు. మా నేత నిజాయితీపరుడు. 2015, అంతకుముందు చేసిన పనులు ప్రజలందరికీ తెలుసు. అందుకే వాటిలో పని చేశామని.. అందుకు గౌరవం పొందామని పేర్కొన్నాం. ధనికులు, పేదలు, జాతి, మతం అన్న భేదం లేకుండా అందరికీ పింఛను పథకం అమలుచేశాం. ఇచ్చిన వాగ్దానాల అమలుకు నిజాయితీగా పని చేశాం."
-రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్, జేడీయూ జాతీయ కార్యదర్శి
జేడీయూ పోస్టర్లలో కూటమి ప్రస్తావనా ఉంది. "సంకల్ప్ హమారా ఎన్డీఏ దొబారా" (మరోమారు ఎన్డీఏ రావాలన్నదే మా సంకల్పం) అని రాసి ఉంది. కానీ... పోస్టర్‌పై ఓ మూలన. అది కూడా చాలా చిన్న అక్షరాల్లో.
ఇవి జేడీయూ పోస్టర్లే కదా అని సరిపెట్టుకోవడానికి లేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. కేంద్రంలో సుస్థిర పాలన, జాతీయ భద్రత వంటి విషయాలను భాజపా ప్రస్తావించినా... బిహార్ ప్రభుత్వ పనితీరు, నితీశ్‌కున్న నిష్కళంక వ్యక్తిత్వమే ప్రధానాంశంగా ఎన్డీఏ ప్రచారం సాగుతుందన్నది ఆయా వర్గాల విశ్లేషణ.
"పల్టూ రామ్" ముద్ర పోగొట్టుకునేందుకే?
నితీశ్ కుమార్‌ది సుదీర్ఘ రాజకీయ అనుభవం. వరుసగా 3 సార్లు బిహార్ ముఖ్యమంత్రి అయిన చరిత్ర. జేడీయూ పగ్గాలు చేపట్టింది ఇటీవలే అయినా... ఆ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి చక్రం తిప్పింది ఆయనే. అలాంటి వ్యక్తికి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ... ఆయన ముందు ఎన్నికలను మించిన సవాలు మరొకటి ఉంది. అదే... "కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి సంపాదించడం".
2013 జూన్ 16న భాజపాతో ఉన్న 17 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంది జేడీయూ. తర్వాత.. ప్రత్యర్థులతోనే జట్టుకట్టింది. 2015 బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి పోటీ చేసింది. మహాకూటమి గెలిచింది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో 20నెలల ప్రయాణం తర్వాత... 2017 జులై 26న కూటమి నుంచి బయటకు వచ్చారు నితీశ్. ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. మరుసటి రోజే మళ్లీ భాజపాతో పొత్తు పెట్టుకొని, వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
కూటముల మార్పునకు... లాలూ కుమారుడు తేజస్విని అవినీతి కేసులు చుట్టుముట్టడాన్ని కారణంగా చెప్పారు నితీశ్. అవినీతిని ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ఈ వివరణలతో ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందలేదు. "పల్టూ రామ్" (అవకాశవాది) అంటూ ప్రత్యర్థులు విమర్శల తూటాలు పేల్చారు.
"నితీశ్ కుమార్ మహాకూటమిని వీడి, భాజపాతో జట్టుకట్టిన పద్ధతితో నేను ఏకీభవించను. ఆయన భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా, మరోమారు ఎన్నికలు ఎదుర్కొని ఉంటే బాగుండేది"
--ప్రశాంత్ కిశోర్, జేడీయూ నేత
ప్రశాంత్ కిశోర్ వంటి సన్నిహితుల మాటలు... నితీశ్‌ను మరింత ఇబ్బందికి గురిచేశాయి. అందుకే... కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి సంపాదించుకునే పని మొదలుపెట్టారు. ఇందుకు సార్వత్రిక సమరాన్ని సందర్భంగా చేసుకున్నారు. ఆయన ప్రయత్నాలు ఏమేర ఫలిస్తాయో వేచిచూడాలి.