తెలంగాణ

telangana

'9 మంది పిల్లల'పై రాజకీయ దుమారం

By

Published : Oct 27, 2020, 7:07 PM IST

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా విమర్శలు తీవ్రతరం చేశారు బిహార్​ సీఎం నితీశ్ కుమార్. వారసుడు కావాలనే కోరికతో 9 మంది పిల్లలను కన్నవారితో రాష్ట్రాభివృద్ది జరుగుతుందా? అని ప్రజల్ని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై లాలూ కుమారుడు, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. శారీరకంగా, మానసికంగా అలసిపోయినందు వల్లే నితీశ్​ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Nitish fires "8-9 kids" jibe; Tejashwi retorts with 'mentally tired' barb
'9మంది పిల్లల'పై రాజకీయ దుమారం

బిహార్​లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్​కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్న తరుణంలో విమర్శలకు పదును పెంచారు నాయకులు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ లక్ష్యంగా పరోక్ష విమర్శలు గుప్పించారు బిహార్ సీఎం నితీశ్​ కుమార్. 9 మంది పిల్లలను కన్నవారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరని ధ్వజమెత్తారు. వైశాలి జిల్లా మహ్నార్​లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

" వారు 9 మంది పిల్లల్ని కన్నారు. కూతుళ్లపై వారికి నమ్మకం లేదు. కొడుకు పుట్టడానికి ముందు ఏడుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఎలాంటి బిహార్​ను వారు నిర్మించాలనుకుంటున్నారు? ఇలాంటి ఆలోచనా విధానంతో బిహార్​కు ఏం జరుగుతుంది?"

-నితీశ్ కుమార్​, బిహార్​ సీఎం.

నితీశ్ వ్యాఖ్యలపై లాలూ కుమారుడు, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ తీవ్రంగా స్పందించారు. ఆయన శారీరకంగా, మానసికంగా అలసిపోయారని.. అందుకే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బహుశా ఐదుగురు తోబుట్టువులున్న ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునే నితీశ్​ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు.

నితీశ్ మాటలు తన తల్లితో పాటు ఇతర మహిళలనూ అవమానించే విధంగా ఉన్నాయని తేజస్వీ ఆరోపించారు. ఆయన విమర్శలను కూడా ఆశీర్వాదంగా స్వీకరిస్తానని పేర్కొన్నారు.

2017లో మహాకూటమిని వీడి ఎన్డీఏతో ఎందుకు జతకట్టాల్సి వచ్చిందో ఎన్నికల సమావేశంలో తెలిపారు నితీశ్. తేజస్వీని మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు అసత్యమని రుజువు చేసుకోవాలని చెబితే ఆయన చేయలేదని, పోలీసులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని.. అది నచ్చకే కూటమి నుంచి బయటకు వచ్చినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details