ఉత్తర బిహార్లో 150 మందికి పైగా చిన్నారుల ప్రాణాలను బలిగొంది మహమ్మారి 'మెదడు వాపు వ్యాధి'. దీని స్వభావాన్ని వైద్య నిపుణులు ఇంకా పసిగట్టలేకపోతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోమవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టి చర్చ నిర్వహించారు. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నితీశ్ వివరణ ఇచ్చారు.
"చిన్నారుల మృతి బాధాకరం. ఎయిమ్స్ వైద్య నిపుణులతో సమావేశమై ఈ వ్యాధి స్వభావాన్ని గుర్తించాలని కోరా. వైద్య నిఫుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించా. వ్యాధి కారకాన్ని తెలుసుకుంటే వేగంగా నియంత్రించే వీలుంటుంది. కేంద్రం నుంచి వ్యాక్సిన్లను తెప్పించి అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నాం."
-నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి.