జేడీయూతో విబేధాల కారణంగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చిన ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్.. సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి రాంవిలాస్ పాసవాన్‌ను నితీశ్ అవమానించారని, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని మరిచి తమ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని విమర్శించారు. తాము మొదటి నుంచీ నితీశ్ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని, అందుకే కూటమి నుంచి బయటకొచ్చినట్లు చెప్పారు చిరాగ్. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన చిరాగ్.. ఈ మేరకు నితీశ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
ఇంకా ఏమన్నారంటే?
"జేడీయూను మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం. ఎన్డీఏను రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అనివార్యంగా జేడీయూతో కలిసి 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన కూటమి ధర్మాన్ని మరిచి ఎల్జేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు. జేడీయూ మద్దతుతోనే రాంవిలాస్ పాసవాన్ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికయ్యారని నితీశ్ చెప్పుకొచ్చారు. వాస్తవం ఏంటంటే మా నాన్నకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి అప్పటి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హామీ ఇచ్చారు. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు మా నాన్న.. నితీశ్‌ను ఆహ్వానిస్తే ఆయన తన అహంకారాన్ని ప్రదర్శించారు. నామినేషన్ ముహూర్తం పూర్తయ్యాక తీరిగ్గా వచ్చారు. ఏ కొడుకూ తన తండ్రికి జరిగిన ఇలాంటి అవమానాల్ని సహించలేడు."