తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్షణాల్లో వైరస్​ పనిపట్టే శానిటైజర్​ అభివృద్ధి చేసిన నిట్​! - NIT develops multipurpose sanitising device to disinfect packed food items, currency

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఏ వస్తువును ముట్టుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి క్రిమి సంహారకాలు వినియోగించని, బహుళ ప్రయోజకర యూవీ శానిటైజర్​ పరికరాన్ని రూపొందించింది జలంధర్​లోని ఎన్​ఐటీ. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

NIT develops multipurpose sanitising device
నిట్​-మల్టీపర్పస్​ శానిటైజింగ్​ పరికరంతో వైరస్​ ఖతం!

By

Published : Jul 10, 2020, 5:40 PM IST

కరోనా భయంతో రోజులో పలు మార్లు చేతులను శుభ్రం చేసుకోవటం, శానిటైజర్​ వాడటం చేస్తున్నాం. కానీ, మనం నిత్యం వినియోగిస్తున్న ఎన్నో రకాల వస్తువులనూ శానిటైజ్​ చేసుకోవాలి. కానీ క్రిమిసంహాకరకాలు వినియోగిస్తే ఎంతో ప్రమాదకరం. ఈ నేపథ్యంలో జలంధర్​లోని డా.బీఆర్​ అంబేడ్కర్​ నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(నిట్​) ఎలాంటి క్రిమిసంహారకాలు అవసరం లేని యూవీ శానిటైజర్​ పరికరాన్ని రూపొందించింది. టైమర్​ అమర్చిన ఈ పరికరం యూవీ రేడియేషన్​ ద్వారా వస్తువులపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్​లను చంపుతుందని వెల్లడించింది.

బాక్సు ఆకారంలో ఉండే ఇందులో పైన, కింది భాగాల్లో అల్ట్రా వయొలెట్​ లైట్లను అమర్చారు. దీని ద్వారా ప్యాకింగ్​ చేసిన ఆహారపదార్థాలు, కరెన్సీ నోట్లు సహా క్రెడిట్​ కార్డులు, పేపర్లు, దస్త్రాలు, వినియోగించిన మాస్కులు, గ్లౌజులు, తాళాలు వంటి వివిధ రకాల వస్తువులను శానిటైజ్​ చేయవచ్చని తెలిపింది నిట్​. బాక్సు డ్రాయర్​లో వస్తువులను ఉంచినప్పుడు యూవీ రేడియేషన్​ కిరణాలు వాటిపై ఉన్న సూక్ష్మజీవులను చంపుతాయని పేర్కొంది.

ఇందులో యూవీ-సీ రేడియేషన్ సాంకేతికతను వినియోగించారు. దీనిని ప్రధానంగా గాలి, నీరు, ఉపరితలంపై సూక్ష్మజీవులను చంపేందుకు వినియోగిస్తున్నారు. యూవీ లైట్స్​ పూర్తి సురక్షితం, తక్కువ నిర్వహణ ఖర్చు, ఎలాంటి క్రిమిసంహారకాలు అవసరం లేనందున ప్రస్తుతం చాలా ఆహార పరిశ్రమల్లో వీటిని ఉపయోగిస్తున్నారు.

నిట్​ డైరెక్టర్​ డా.ఎల్​కే అశ్వతి, అసోసియేట్​ ప్రొఫెసర్​ డా. కుల్​దీప్​ సింగ్​ సంయుక్తంగా దీనిని రూపొందించారు. ఈ పరికరం పెద్దవారితో పాటు చిన్నారులకూ చాలా సురక్షితమని చెబుతున్నారు.

" మార్కెట్లో ఇలాంటి ఇతర యూవీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మా శానిటైజర్​లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీంతో మనుషులపై ఎలాంటి ప్రభావం పడదు. చాలా సురక్షితమైంది. డ్రాయర్​ తెరిచినప్పుడు యూవీ లైట్స్​ ఆటోమేటిక్​గా ఆఫ్​ అవుతాయి. ఇందులో ఆక్రిలిక్​ షీట్లు, లైట్లు అమర్చటం వల్ల అన్ని కోణాల నుంచి వస్తువులపై యూవీ లైట్స్​ పడి వైరస్​ను అంతమొందిస్తుంది. ఇళ్లు, కార్యాలయాల్లోనే కాక బ్యాంకుల్లోనూ సురక్షితంగా వినియోగించవచ్చు. క్యాషియర్​ నోట్లను పరికరంలోని డ్రాయర్​​లో పెట్టి 2 నిమిషాల సమయాన్ని సెట్​చేస్తే.. సమయం పూర్తయిన తర్వాత అదే ఆఫ్​ అవుతుంది. అదే విధంగా ప్యాకింగ్​ చేసిన ఆహారపదార్థాలు, బాటిళ్లు వంటివి శానిటైజ్​ చేయొచ్చు. టైమర్​ను 5 నిమిషాల వరకు సెట్​ చేయవచ్చు. ఇందులో బిగించిన ఫ్యాను ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది."

- డా.కుల్​దీప్​ సింగ్​, నిట్ అసోసియేట్​ ప్రొఫెసర్​ ​

ఈ పరికరాన్ని ఇప్పటికే పేటెంట్​ హక్కుల కోసం పంపినట్లు చెప్పారు డా. అశ్వతి. వాణిజ్య ఉత్పత్తి కోసం ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: యూవీ శానిటైజర్​తో నిమిషాల్లోనే క్రిములు ఖతం!

ABOUT THE AUTHOR

...view details