వృద్ధిని పెంచేందుకు దిగుమతుల్లో తప్పు లేదన్నారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం అన్నారు. అయితే గణేశుడి విగ్రహాలనూ చైనా నుంచి కొనటం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రారంభోత్సవంలో భాగంగా తమిళనాడు భాజపా కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీతారామన్ మాట్లాడారు.
"మన పరిశ్రమలకు అవసరమైన ముడిపదార్థాలు దేశంలో లభించనప్పుడు దిగుమతులపై ఆధారపడాల్సిందే. దాని వల్ల ఉత్పత్తి పెరిగి ఉపాధి లభిస్తుంది. అయినప్పటికీ ఉద్యోగ అవకాశాలు, వృద్ధి, స్వావలంబన వంటి ప్రయోజనాలను దిగుమతులతో సాధించలేం.
ఏటా గణేశ్ విగ్రహాలను కుమ్మరులు సంప్రదాయంగా మట్టితో తయారు చేసేవారు. కానీ, ఇప్పుడు చైనా నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? ఎందుకీ పరిస్థితి ఏర్పడింది? మట్టితో మనం విగ్రహాలను చేసుకోలేమా?"
- నిర్మలా సీతారామన్
మన వద్ద ఎంఎస్ఎంఈలు ఉండగా.. సబ్బు పెట్టె, ఇతర ప్లాస్టిక్ వస్తువులు లేదా పూజ కోసం ఉపయోగించే ధూపం వంటి వస్తువుల దిగుమతి చేసుకోవడం స్వయం సమృద్ధికి తోడ్పడవని పేర్కొన్నారు నిర్మల. అందుకే ప్రధాని నరేంద్రమోదీ ఆత్మ నిర్భర్ భారత్‌ను ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే పూర్తి స్థాయిలో దిగుమతులను ఆపేయ్యాలని కాదని, అవసరమైన మేరకు కొనుగోళ్లు చేయాలని చెప్పారు.