తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో 'వలస' కష్టాలపై ఏం చేశారు?' - నిర్మలా సీతారామన్ ఇంటర్వ్యూ

కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రకటించిన ఉద్దీపన పథకంలో.. పేదలు, వలస కార్మికులు, బలహీన వర్గాలకు సహాయం లభించలేదన్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొట్టిపారేశారు. నేరుగా నగదు అందించడమే సమస్యకు ఏకైక పరిష్కారం కాదని నొక్కిచెప్పారు. న్యూస్‌18కు ఇచ్చిన ముఖాముఖిలో వలస కార్మికుల కష్టాలు సహా కీలక అంశాలపై ఆమె మాట్లాడారు.

nirmala sitaraman
నిర్మలా సీతారామన్

By

Published : May 21, 2020, 12:12 AM IST

ఉద్దీపన పథకం ద్వారా ప్రజలకు నేరుగా నగదు అందించాలన్న ఆర్థికవేత్తలు, పరిశీలకుల వాదనలను తాము విన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ దారిలోనే నడవాలని నిర్ణయించుకుందన్నారు.

న్యూస్​18 నెట్​వర్క్​తో ప్రత్యేకంగా మాట్లాడిన నిర్మలా సీతారామన్​.. సంస్థలకు నగదు లభ్యత (లిక్విడిటీ) కల్పించడం ద్వారా పర్యవసాన ప్రభావం (క్యాస్‌కేడింగ్‌ ఎఫెక్ట్‌) కనిపిస్తుందన్నారు. ఫలితంగా ఎక్కువ మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు జీవనం సాగించేందుకు నగదు బదిలీ చేయడం, అదనంగా తిండిగింజలు, ఆహార పదార్థాలు అందించేందుకు మొదటి పరిహార పథకం అమలు చేశామని తెలిపారు. రెండో ఉద్దీపన పథకం మరింత సమగ్రంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు..

రెండో పథకంలో భాగంగా వ్యాపార, వాణిజ్య రంగాలకు తోడ్పాటు, సంస్థలకు సులభ రుణాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆయా రంగాల్లో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సంస్కరణలు చేపట్టడం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ప్రధాని ప్రకటించిన రూ.20 లక్షల ప్యాకేజీలో కేంద్రానికి ఖర్చవుతున్నది అందులో 10 శాతమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

అన్ని చర్యలు తీసుకున్నాం..

పేదల ప్రస్తుత అవసరాలను ఆర్థిక ఉద్దీపన పథకం తీర్చలేదన్న విమర్శలపై సీతారామన్‌ స్పందించారు. అత్యవసర కష్టాలు తీర్చేందుకు విపత్తు నిర్వహణ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నిధులు ఉపయోగించామని తెలిపారు. శిబిరాల్లో వలస కార్మికులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. 'క్షేత్రస్థాయిలో రాష్ట్రాలు ఈ అంశాన్ని చూసుకున్నాయి. అక్కడి పరిస్థితులు ఏమిటో, ఏ అంశాలు వారిని నిలువరించాయో రాష్ట్రాలకే మెరుగ్గా తెలుసు' అని ఆమె అన్నారు. కరోనా వైరస్‌ సోకుతుందన్న భయంతోనే వలస కార్మికులు నగరాలను వదిలి సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారని వెల్లడించారు.

"ప్రస్తుతం వలస కార్మికులు బాధాకరమైన పరిస్థితి అనుభవిస్తున్నారు. రైళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పగానే స్వస్థలాలకు వెళ్లిపోదామన్న ఆలోచనతోనే ఉండిపోయారు. ఇలా చెబుతున్నందుకు క్షమించండి! ఈ పరిస్థితుల్లో ఇంకెవరూ ఏమీ చేయలేరు.'

-నిర్మలా సీతారామన్

వలస కూలీలకు..

వలసకూలీలకు సాయం చేసేందుకు ప్రభుత్వం, పౌర సమాజం సమానంగా బాధ్యత వహించాలన్నారు నిర్మల. వారు భావోద్వేగం నుంచి బయటపడేందుకు సాయపడాలి తప్ప రాజకీయంగా వేలెత్తి చూపొద్దని పేర్కొన్నారు.

"ప్రతిపక్షాలు మార్కులు కొట్టేయొచ్చనే ఆలోచించాయి. కానీ వారి వంచనే బయటపడింది. వారు (కాంగ్రెస్‌) మొదట కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల పరిస్థితులను అదుపు చేయాల్సింది. ఎవరొస్తున్నారు? ఎక్కడ్నుంచి వస్తున్నారు? వారి నైపుణ్యాలేంటి? తరహా సమాచారాన్ని నమోదు చేసి భద్రపరచడం కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల బాధ్యత. సమాచార అంతరాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మెరుగైన సమాచార స్రవంతి కోసం మనం వలస కార్మికులకు రుణపడి ఉన్నాం."

- నిర్మలా సీతారామన్

ABOUT THE AUTHOR

...view details