తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్టులో నిర్భయ తల్లి కన్నీరు- జడ్జి ఓదార్పు - NIRBHAYA MOTHER

నిర్భయ కేసు దోషులకు సత్వరమే శిక్ష అమలు చేయాలన్న అభ్యర్థనపై విచారణ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మృతురాలి తల్లి. ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని దోషులు అనడాన్ని ప్రస్తావిస్తూ కన్నీరుపెట్టుకున్నారు. నిర్భయ తల్లిని జడ్జి ఓదార్చారు.

NIRBHAYA'S MOTHER BURSTS  OUT IN COURT
కోర్టులో నిర్భయ తల్లి కన్నీరు- జడ్జి ఓదార్పు

By

Published : Dec 18, 2019, 5:46 PM IST

2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకునే అంశంపై దోషుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఒక వారం గడువునిస్తూ.. తిహార్​​ జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది దిల్లీ పటియాల హౌస్​ కోర్టు. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్​ కుమార్​ సింగ్​ రివ్యూ పిటిషన్​ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నేడు తీర్పునిచ్చిన నేపథ్యంలో దిల్లీ కోర్టు ఆదేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

దోషులకు ఉరిశిక్షను వెంటనే అమలు చేయాలని నిర్భయ తల్లి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టారు అదనపు సెషన్స్​ జడ్జి సతీశ్​ కుమార్​ అరోరా. డెత్​ వారెంట్​ ఇవ్వాలని నిర్భయ తల్లి తరఫున న్యాయవాది జడ్జిని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం... తిహార్​ జైలు అధికారులకు తాఖీదులిచ్చింది. తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.

నిర్భయ తల్లి కన్నీరు...

విచారణ సమయంలో నిర్భయ తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'మేము వెళ్లిన ప్రతి చోట... ఊరట పొందేందుకు తమకు న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని వారు(దోషులు) అంటున్నారు. ఏంచెయ్యాలి?' అని నిర్భయ తల్లి అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

రోదిస్తున్న నిర్భయ తల్లిని ఓదార్చారు జడ్జి. 'నాకు మీపై సానుభూతి ఉంది. మీ కుటుంబంలో ఒకరు చనిపోయారని నాకు తెలుసు. కానీ వారికి(దోషులు) కూడా హక్కులున్నాయి. మీరు చెప్పేది వినడానికే మేము ఉన్నది. కానీ మేము చట్టానికి కట్టుబడి ఉన్నాము' అని అన్నారు.

ఇదీ ఘటన

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకడు మైనర్​ కాగా.... మరొకడు తిహార్​ జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన దోషులైన ముకేశ్​, పవన్​ గుప్తా, వినయ్​ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. మరో దోషి అక్షయ్​ కుమార్ సింగ్​.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు. దీనినీ ఈ ఉదయం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ABOUT THE AUTHOR

...view details