నిర్భయ కేసు దోషులను మరణశిక్ష నుంచి తప్పించేందుకు వారి న్యాయవాదులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ తరపు న్యాయవాది ఎమ్ఎల్ శర్మ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. నిర్భయ అత్యాచారం జరిగిన సమయంలో ముఖేశ్ దిల్లీలోనే లేడన్న కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అందువల్ల అతడి మరణశిక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా ముందు దాఖలు చేసిన పిటిషన్లో... 'ముఖేశ్‌ను 2012 డిసెంబర్ 17న రాజస్థాన్‌లో అరెస్టు చేసి దిల్లీకి తీసుకువచ్చారు. నిజానికి నిర్భయ హత్యాచారం జరిగిన డిసెంబర్ 16న అతను దిల్లీ నగరంలోనే లేడు' అని పేర్కొన్నారు. తిహార్ జైలు అధికారులు ముఖేశ్ సింగ్‌ను హింసించారని కూడా ఈ పిటిషన్లో ఆరోపించారు 'న్యాయవాది' ఎమ్ఎల్ శర్మ.
ముఖేశ్ అభ్యర్థనను తప్పుబట్టారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఉరి శిక్షను వాయిదా వేయించేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... పిటిషన్‌ను కొట్టివేసింది.