నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవీ తన భర్తతో విడాకులు ఇప్పించాలని కోర్టుకెక్కింది. హత్యాచారం చేసిన వ్యక్తికి వితంతువుగా జీవించలేనంటూ సెంట్రల్ బిహార్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
భర్త లైంగిక నేరాలకు పాల్పడినప్పుడు సదరు భార్యకు విడాకులు తీసుకునే హక్కు ఉంటుందని పునీతా తరపు న్యాయవాది ముకేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు తన భర్త అమాయకుడంటూ చెబుతూ వచ్చింది పునీతా దేవీ. అనవసరంగా తన భర్తను ఈ కేసులో ఇరికించారంటూ వాదించింది. ఈ నేపథ్యంలో విడాకుల వ్యవహారం కేవలం ఉరి శిక్షను వాయిదా వేసేందుకు ఓ కుట్ర అని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మూడు సార్లు నిర్భయ దోషుల ఉరి శిక్ష వాయిదా పడింది. శిక్షను సవాల్ చేసేందుకు న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకోవడం వల్ల దోషులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో మార్చి 20న ఉరి అమలుకు ఆదేశిస్తూ డెత్ వారెంట్ జారీ చేసింది దిల్లీ కోర్టు.