తెలంగాణ

telangana

నిర్భయ దోషుల ఉరికి ముందు ఆ 8 గంటలు....

By

Published : Mar 20, 2020, 12:15 PM IST

Updated : Mar 20, 2020, 1:11 PM IST

ఉదయం 5.30... నిర్భయకు న్యాయం జరిగిన క్షణం. నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలైన సమయం. అయితే... అంతకు ముందు కొద్దిగంటలపాటు మానసికంగా ప్రత్యక్ష నరకం అనుభవించారు ఆ కిరాతకులు. మృత్యు భయంతో గురువారం రాత్రి అసలు నిద్రపోలేదు. ఈ వేకువజామున స్నానం చేయలేదు. అల్పాహారం తినడానికి ఇష్టపడలేదు. తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. మనోవేదన అనుభవించారు. చివరకు 30 నిమిషాల పాటు ఉరికంబానికి శవాలై వేలాడారు.

Nirbhaya convicts spend restless night, refuses breakfast before hanging
నిర్భయ దోషుల ఉరికి ముందు ఆ 6 గంటలు....

మరణం.. మనిషికి ఏదో ఒక రోజు అనివార్యం. కానీ.. రేపు అనే రోజున మనం జీవించి ఉండమనే విషయం ముందుగానే తెలిస్తే? ఆ భయం చాలు మనల్ని చంపేయడానికి. నిర్భయ దోషులు గురువారం ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. మృత్యు భయంతో ముకేశ్​, అక్షయ్​, వినయ్​, పవన్​.. గురువారం రాత్రి అసలు నిద్రపోలేదని తిహార్​ జైలు అధికారులు తెలిపారు.

ఉరిశిక్ష అమలును వాయిదా వేసేందుకు తీవ్రంగా శ్రమించారు దోషులు. చివరి నిమిషంలో దిల్లీకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ ఉరిశిక్ష... మళ్లీ వాయిదా పడుతుందని ఆశించారు. కానీ కోర్టులు వీరి పిటిషన్లకు వ్యతిరేకంగా తీర్పునివ్వడం వల్ల నలుగురూ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అక్షయ్​ భోజనం కూడా చేయలేదు.

ఉదయం స్నానం చేయాలని పోలీసులు చెప్పినా నలుగురు దోషులు వినలేదు. కనీసం దుస్తులైనా మార్చుకోలేదు.

చివరి ఘడియలు..

  • శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచిన తలారి- జైలు అధికారులతో సమావేశం.
  • ఉరి తాళ్లను చివరిసారిగా పరీక్షించిన తలారి.
  • ముఖాలపై నల్ల వస్త్రాలతో ఉరికంబం ఎక్కిన ఖైదీలు.
  • ఒక్కొక్కరికీ ఉరితాళ్ల ఉచ్చు బిగింపు.
  • ఉదయం 5:30 గంటలకు జైలు సూపరిండెంట్​ అనుమతితో ఉరి అమలు.
  • నిబంధనల ప్రకారం 30 నిమిషాల పాటు ఉరికంబానికి వేలాడిన మృతదేహాలు.

చివరి కోరికలు...

ఉరి తీసే ముందు దోషులను తమ చివరి కోరికలు అడగడం తప్పనిసరి. నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్​.. తన అవయవాలను దానం చేయడానికి సిద్ధపడ్డాడు. తన పెయింటింగ్స్​ను జైలు సూపరిండెంట్​కు, తన వద్ద ఉన్న హనుమాన్​ చాలీసాను తన కుటుంబానికి అందజేయాలని మరో దోషి వినయ్​ కోరాడు. అయితే నలుగురిలో ఒక్కరు కూడా వీలునామా రాయలేదు.

జైల్లోనూ...

నలుగురు దోషులు ఏడేళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో వారి ప్రవర్తనపై అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. నిబంధనలను పాటించకపోవడం వల్ల వినయ్​పై 11సార్లు చర్యలు చేపట్టారు అధికారులు. పవన్​ 8, ముకేశ్​ 3, అక్షయ్​​ ఒకసారి శిక్ష ఎదుర్కొన్నారు.

జైలు జీవితంలో రోజువారీ కూలీ చేసి.. వినయ్​ రూ.39వేలు అర్జించాడు. పవన్​ రూ.29వేలు, అక్షయ్​ రూ.69వేలు సంపాదించారు. ముకేశ్​ మాత్రం జైలులో కూలీ పని చేయనని తేల్చిచెప్పాడు.

2012 దిల్లీలో 23ఏళ్ల వైద్యురాలిని అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన ఘటన యావత్​ భారత దేశాన్ని కుదిపేసింది. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాల నేరస్థుడనే కారణంగా మూడేళ్ల అనంతరం వీరిలో ఒకడిని విడుదల చేశారు. మరొకడు తిహార్​ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చూడండి:-ఉరి సమయంలో ఖైదీ ముఖానికి నల్ల వస్త్రం ఎందుకు?

Last Updated : Mar 20, 2020, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details