ఉరిశిక్ష.. ఈ పేరు వినడమేగానీ ఎలా అమలు చేస్తారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అప్పుడప్పుడు సినిమాల్లో చూసి.. నిజజీవితంలోనూ అదే విధంగానే ఖైదీలను ఉరితీస్తారేమో అనుకుంటాం. అయితే కారాగారంలో ఓ ఖైదీని ఉరి తీయాలంటే జైలు అధికారులకు ఎన్నో నిబంధనలుంటాయి. అవేంటంటే..
ఉరిశిక్ష అమలు ఇలా...
⦁ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, ఇంఛార్జ్ వైద్యాధికారి, రెసిడెంట్ వైద్యాధికారి, జిల్లా కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ సమక్షంలో ఉరిశిక్ష అమలవుతుంది.
⦁ ఉరిశిక్ష అమలుకు ఒక్కరోజు ముందు ఉరితాళ్లతో పాటు ఉరికంబాన్ని పరీక్షించే ప్రక్రియను జైలు సూపరింటెండెంట్ దగ్గరుండి పర్యవేక్షిస్తారు.
⦁ అనంతరం ఖైదీల బరువుకు 1.5 ఇంతలు బరువుండే ఇసుక బస్తాను ఉరికంబం నుంచి 1.830 నుంచి 2.440 మీటర్ల వరకు కిందకు వదిలి ఉరితాడును పరీక్షిస్తారు.
⦁ ఉరిశిక్ష అమలు ప్రాంతంలో 10 మందికి తక్కువ కాకుండా కానిస్టేబుళ్లు, వార్డెన్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, హెడ్ వార్డెన్లు, అదే సంఖ్యలో జైలు సాయుధ గార్డులు ఉంటారు.
⦁ ఉరిశిక్షను చూసేందుకు దోషుల కుటుంబసభ్యులను అనుమతించరు.
⦁ ఒకవేళ ఖైదీ కోరుకుంటే అతనికి నమ్మకమున్న పూజారిని ఉరిశిక్ష చూసేందుకు అనుమతిస్తారు.