2012లో దేశ రాజధాని నడిబొడ్డున సంచలనం రేకెత్తించిన 'నిర్భయ' అత్యాచారం, హత్య ఘటన బాధితురాలికి న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. ఉరి శిక్షను ఆపేందుకు దోషులు చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నలుగురు దోషులను రేపు ఉదయం 5.30 గంటలకు దిల్లీ తిహార్ జైల్లో ఉరి తీయనున్నారు. వారు శ్వాస తీసుకునేది మరికొన్ని గడియలు మాత్రమే. ఆ తర్వాత ప్రాణాలు గాల్లో కలవనున్నాయి.
ముకేశ్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31) నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు. మార్చి 20న ఉరి తీయాలని 15 రోజుల కిందటే దిల్లీ ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు దిల్లీ తిహార్ కారాగారంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జైలు సిబ్బంది.
ఈ రోజంతా హైడ్రామా...
చివరి నిమిషంలో నిర్భయ దోషులకు చుక్కెదురయింది. ఉరిపై స్టేను నిరాకరించిన దిల్లీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముగ్గురు దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది.
దోషుల పిటిషన్‌పై అర్ధరాత్రి విచారణకు స్వీకరించింది జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరూలా ధర్మాసనం. వ్యాజ్యంలో సరైన వివరాలు చేర్చలేదని చెబుతూ తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశ తప్పలేదు. పవన్ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించటాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
నిన్న జరిగిన పరిణామాలు..
ఉరి అమలుపై స్టే విధించాలని దోషులు అక్షయ్, పవన్, వినయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ పటియాలా హౌస్ కోర్టు గురువారం తిరస్కరించింది. ఉరి శిక్షను ఆపేందుకు ఆఖరి రోజున విశ్వప్రయత్నాలు చేశారు నిర్భయ దోషులు. వేర్వేరు సాకులతో దిల్లీ కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్లు అన్నింటినీ న్యాయస్థానాలు కొట్టివేశాయి.
దోషులు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ తమ ఉరి శిక్షపై స్టే విధించాలనంటూ దిల్లీ కోర్టును ఆశ్రయించగా.. అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా నేతృత్వంలోని ధర్మాసనం వారి పిటిషన్‌ను కొట్టివేసింది.
పవన్ గుప్తా రెండోసారి వేసిన క్యురేటివ్ పిటిషన్‌నూ సుప్రీం కోర్టు కొట్టివేసింది. దోషి అక్షయ్ రెండోసారి దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని కూడా సుప్రీం కొట్టివేసింది. జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం... పిటిషన్‌ను విచారించదగ్గ అర్హత లేదని తేల్చిచెప్పింది.
అక్షయ్ తొలుత జనవరి 29న, అనంతరం.. మార్చి 18న క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. ఈ రెండూ తిరస్కరణకు గురయ్యాయి. అంతకు ముందు, నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను దిల్లీలోనే లేనంటూ నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ అభ్యర్థననూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.