నిర్భయ హత్యాచార కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు.
ఉరి అమలు కావాల్సిన నలుగురు దోషుల్లో ముకేశ్, వినయ్ క్షమాభిక్ష పిటిషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. మరో దోషి పవన్ ఇప్పటి వరకు క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోలేదు.
'ఉరి'పై దిల్లీ కోర్టు స్టే
నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే... డెత్వారెంట్లపై దిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ నిలుపుదల అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు మిగిలే ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యే వరకు ఉరిని వాయిదా వేయాలని దోషులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే ఎత్తివేసేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, దిల్లీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పటియాలా హౌస్ కోర్టు విధించిన స్టేను ఎత్తివేసే అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరింత జాప్యం అవుతుండగా.. రాజకీయంగా వచ్చే ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో స్టేను కొట్టివేయాలని కేంద్రం దిల్లీ కోర్టును ఆశ్రయించింది.