నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సమయం దగ్గర పడుతున్న క్రమంలో దోషుల చివరి కోరిక తెలపాలని వారికి నోటీసులు ఇచ్చారు తిహార్ జైలు అధికారులు.
చివరి కోరిక ప్రకారం.. దోషులు కుటుంబ సభ్యులు, దగ్గరి వారిని కలవటం, తనకు చెందిన స్థిరాస్తులు మరొకరికి బదిలీ చేయటం, ఏదైనా పుస్తకం కావాలని కోరటం, ఆధ్యాత్మిక గురవును కలవటం వంటివి కోరవచ్చు.
ఒత్తిడిలో ఇద్దరు దోషులు
ఉరి తీసేందుకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో నలుగురు దోషుల్లో ఇద్దరు ఒత్తిడికి లోనయ్యారని.. సరిగా భోజనం కూడా చేయట్లేదని చెప్పారు జైలు అధికారులు. డెత్ వారెంట్ జారీ అయిన క్రమంలో దోషి వినయ్ రెండు రోజుల పాటు ఆహారం తీసుకోలేదని, అయితే.. బుధవారం తాను ఆహారం తీసుకున్నట్లు తెలియజేసినట్లు చెప్పారు. పవన్ కుమార్ కూడా భోజనం చేసేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు.
24 గంటల నిఘా..
మరణ శిక్ష అమలుకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో దోషులు ఉన్న జైలు గదులపై 24 గంటలు నిఘా ఉంచారు అధికారులు. జైలు నంబర్ 3లోని వివిధ గదుల్లో దోషులను ఉంచిన నేపథ్యంలో గదికి ఇద్దరు చొప్పున సిబ్బందిని కాపాలాగా ఏర్పాటు చేశారు.
మరోమారు వాయిదాకు అవకాశం..!
మరణ శిక్షను తప్పించుకునేందుకు దోషి ముఖేశ్‌కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నా.. అది తిరస్కరణకు గురైంది. అయితే.. మరో ముగ్గురు నిందితులకు క్షమాభిక్ష పెట్టుకునేందుకు అవకాశం ఉంది. ఇందులో ఇద్దరు క్యూరేటివ్ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి.
ఈ క్రమంలో ముగ్గురు దోషుల్లో ఎవరైనా క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకుంటే.. ఉరిశిక్ష అమలు మరోమారు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని జైలు అధికారులు చెబుతున్నారు. క్షమాభిక్ష తిరస్కరణకు గురైనా.. శిక్ష అమలు చేసేందుకు 14 రోజుల గడువుతో మరోమారు డెత్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా!