నిర్భయ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఉరి శిక్ష ఓ సారి వాయిదా పడగా.. మరింత ఆలస్యం కోసం దోషులు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు.
ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా ధర్మాసనాన్ని అభ్యర్థించాడు వినయ్. ఫిబ్రవరి 1న వినయ్‌కు క్షమాభిక్షను నిరాకరించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
ఉరిపై 31న స్టే...
నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. జనవరి 31న స్టే ఉరిపై స్టే విధిస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దోషులకు ఇంకా న్యాయపరమైన అవకాశాలున్నాయి. పవన్ గుప్తా ఇప్పటికీ క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోలేదు. క్షమాభిక్షకూ అవకాశం ఉంది.
సుప్రీం కీలక తీర్పు..
మరోవైపు ఉరి శిక్షపై స్టే తొలగించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ.. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది సుప్రీం. ఈ విషయమై స్పందన తెలియజేయాల్సిందిగా నలుగురు దోషులకు నోటీసులు జారీ చేసింది.