నిర్భయ సామూహిక అత్యాచారం, హత్యోదంతం కేసులో మరణ శిక్ష విధించిన దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాన్ని పరిశీలించి మళ్లీ కొట్టివేసింది.
నేరం చేసిన సమయంలో తాను మైనర్ అన్న వాదనను దిల్లీ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ.. పవన్ దాఖలు చేసిన పిటిషన్ను జనవరి 20నే అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. తాజాగా ఈ ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ పవన్ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా దిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తీర్పు వెలువరించే ముందు తెలిపింది ధర్మాసనం.