ఇక ఉరిశిక్షే.. నిర్భయ దోషుల క్యురేటివ్ పిటిషన్లు కొట్టివేత మరణశిక్షను నిలిపివేయాలని నిర్భయ కేసులోని ఇద్దరు దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నలుగురు దోషుల్లో ఇద్దరు.. వినయ్ శర్మ (26), ముకేశ్ కుమార్ (32) ఈ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిని ఛాంబర్‌లో విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తిరస్కరించింది.
పిటిషన్ల వాదనకు ఎలాంటి విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. తాజా తీర్పుతో దోషుల ముందున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశం ముగిసింది.
"మరణశిక్షపై స్టే విధించాలన్న అభ్యర్థననూ తిరిస్కరించాము. క్యురేటివ్ పిటిషన్లు, సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించాం. మా అభిప్రాయం ప్రకారం, ఈ పిటిషన్లలో ఎలాంటి హేతుబద్ధత లేదు. కనుక క్యురేటివ్ పిటిషన్లను తిరస్కరిస్తున్నాం." - సుప్రీం ధర్మాసనం
కోర్టు తీర్పు పట్ల నిర్భయ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఏడేళ్ల తన న్యాయపోరాటం ఫలించిందన్నారు. కానీ, దోషుల్ని ఉరితీయనున్న రోజే తనకు అత్యంత సంతోషకరమైన రోజని ఆమె వ్యాఖ్యానించారు.
ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ (26), ముకేశ్ కుమార్ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25)లను ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ దిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసింది.
ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇద్దరు దోషులు వినయ్ శర్మ, ముకేశ్ కుమార్ గతవారం తమకున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశం.. క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.