నిర్భయ దోషుల ఉరి అంశంలో ఈరోజు కూడా సందిగ్ధత కొనసాగింది. దోషుల ఉరిపై ఉన్న స్టేను కొట్టివేయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. ఈ విషయంపై అందరి వాదనలు విన్న తర్వాతే తీర్పును వెలువరిస్తామని జడ్జి సురేశ్ కైత్ స్పష్టం చేశారు.
వాడీవేడిగా వాదనలు...
విచారణ సందర్భంగా కేంద్రం- దోషుల తరఫు న్యాయవాదుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి.
ముందుగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... దోషుల తీరుపై మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను వినోదాత్మకంగా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరి వాయిదా వేయడం కోసం చట్టాన్ని అవహేళన చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు.
అనంతరం ముగ్గురు దోషుల(అక్షయ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా) తరపున న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఉరిపై విధించిన స్టేను నిలిపివేయాలని కేంద్రం చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరారు.
మరో దోషి ముకేశ్ కుమార్ తరఫున వాదించిన న్యాయవాది రెబెకా జాన్.. కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందెన్నడూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం నుంచే శిక్ష అమలులో జాప్యం జరుగుతోందంటూ కేంద్రం ఆరోపిస్తోందని వ్యాఖ్యానించారు.