నిర్భయ దోషుల ఉరి అమలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నలుగురు దోషులకు శిక్ష అమలు చేసేందుకు కొత్త డెత్ వారెంట్ జారీ చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది ట్రయల్ కోర్టు.
డెత్ వారెంట్ జారీ కోసం కింది కోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు ఆలకించింది. ఈ క్రమంలో దోషి పవన్ గుప్తా తనకు న్యాయవాది లేరని తెలిపాడు. పవన్ అభ్యర్థన మేరకు న్యాయసహాయం అందించేందుకు అంగీకరించింది కోర్టు. దోషులు చివరి శ్వాసవరకు న్యాయసహాయం పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది.
తన న్యాయవాదిని తొలగించానని.. కొత్త లాయర్‌ను నియమించుకునేందుకు మరింత సమయం కావాలని పవన్ గుప్తా కోరాడు. అయితే.. పవన్ వైపు ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు అడిషనల్ సెషన్స్ జడ్జ్ ధర్మేందర్ రానా.