తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయకు ఎట్టకేలకు న్యాయం- ఈ నెల 22న దోషులకు ఉరి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నిర్భయ' సామూహిక అత్యాచార కేసు దోషుల ఉరిశిక్షకు తేదీ ఖరారైంది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు దిల్లీ తిహార్​ జైలులో నలుగురు దోషులకు మరణశిక్ష విధించనున్నారు. దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు ఈమేరకు డెత్​ వారెంట్​ జారీ చేసింది.

NIRBHAYA
'నిర్భయ' దోషులకు ఈనెల 22న ఉరిశిక్ష

By

Published : Jan 7, 2020, 5:38 PM IST

Updated : Jan 7, 2020, 7:22 PM IST

నిర్భయకు ఎట్టకేలకు న్యాయం- ఈ నెల 22న దోషులకు ఉరి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దోషులకు డెత్​ వారెంట్​ జారీ అయింది. ఈ నెల 22న తిహార్​ జైల్లో ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలు జరగనుంది. దోషులకు సత్వరమే శిక్ష విధించాలన్న నిర్భయ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది.

నలుగురు దోషులు ముఖేశ్​ (32), పవన్​ గుప్తా (25), వినయ్​ శర్మ (26), అక్షయ్​ సింగ్ (31)కు అడిషనల్​ సెషన్స్​ న్యాయమూర్తి సతీశ్​ కుమార్​ అరోడా డెత్​ వారెంట్​ జారీ చేశారు.

వాదోపవాదనలు...

దోషులకు సంబంధించి ఏ న్యాయస్థానంలోనూ లేదా రాష్ట్రపతి వద్ద ఎలాంటి అర్జీలు, పిటిషన్లు పెండింగ్​లో లేవని నిర్భయ తరఫు న్యాయవాది వాదించారు. దోషుల రివ్యూ పిటిషన్లను ఇప్పటికే సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయాన్ని ప్రస్తావించారు. డెత్​ వారెంట్​ జారీకి, అమలుకు మధ్య ఉన్న వ్యవధిలో దోషులు క్యూరేటివ్​ పిటిషన్​ దాఖలు చేసుకోవచ్చన్నారు. తక్షణమే నలుగురు దోషులకు డెత్​ వారెంట్​ జారీ చేయాలని కోరారు.

ఇప్పటికే సుప్రీం కోర్టులో క్యూరేటివ్​ పిటిషన్​ దాఖలుకు ప్రక్రియ మొదలు పెట్టామని దోషులు ముఖేశ్​, వినయ్​ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం నలుగురు దోషులకు డెత్​ వారెంట్​ జారీ చేసింది.

నిర్భయకు న్యాయం జరిగింది..

కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు తమ కుమార్తెకు న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని అభిప్రాయపడ్డారు. దిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌, పంజాబ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మనీశా గులాటీ సహా పలువురు తీర్పును స్వాగతించారు.

ఏం జరిగింది?

2012 డిసెంబరు 16 రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడం వల్ల మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి రాంసింగ్ తిహార్​​ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని 2019 జులై 9న కొట్టివేసింది.

Last Updated : Jan 7, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details