నిర్భయ అత్యాచారం, హత్య కేసులో క్షమాభిక్ష పిటిషన్లు, క్యూరేటివ్ పిటిషన్లతో ఉరిశిక్ష అమలు పలుమార్లు వాయిదా పడేలా చేసిన దోషులు.. తన ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తున్నారు. శిక్ష అమలును తప్పించుకునేందుకు న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకున్న దోషులు.. తాజాగా ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.
సుప్రీం కోర్టుకు ముకేశ్..
నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్.. తనకు ఉన్న న్యాయపరమైన అన్ని అవకాశాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో తన న్యాయవాది తనను తప్పుదారి పట్టించారని ఆరోపించాడు. రివ్యూ పిటిషన్‌లను తిరస్కరించిన తర్వాత క్యూరేటివ్ పిటిషన్‌లను దాఖలు చేసేందుకు మూడేళ్ల వరకు గడువు ఉంటుందని తెలిపిన ముకేశ్.. అందువల్ల 2021 జులై వరకు అందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాడు.