'నిర్భయ'ట్విస్ట్.. మరో క్షమాభిక్ష అర్జీతో ఉరిశిక్షపై అనిశ్చితి! దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయపై అత్యాచారం, హత్యోదంతం కేసులో మూడో దోషి అక్షయ్ ఠాకూర్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరపనున్నారు.
మరింత ఆలస్యం అవుతుందా?
ఈ కేసులో మరో దోషి వినయ్ కుమార్ శర్మ కూడా క్షమాభిక్ష పిటిషన్ వినియోగించుకున్నాడు. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం, ఒకే నేరానికి పాల్పడిన దోషులకు ఒకేసారి మరణశిక్ష అమలు చేయాలి. వీరిలో ప్రతి ఒక్కరూ తమకున్న చట్టపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకున్న తరువాతనే, శిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, సాధారణంగా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషిన్‌ను తిరస్కరించిన 14 రోజుల వరకు దోషులను ఉరితీయలేరు. కనుక నిర్భయ దోషుల 'ఉరి'శిక్ష అమలు ఆలస్యమయ్యే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చివరి ప్రయత్నాలు..!
మరోవైపు, 2012లో జరిగిన ఈ దారుణ ఘటనలో దోషులుగా తేలిన నలుగురినీ ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు ఉరిశిక్ష అమలును వాయిదా వేయించేలా దోషులు తమకున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశాలను వెతుక్కుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ అక్షయ్ ఠాకూర్ గత నెలలో రివ్యూ పిటిషన్ వేయగా సుప్రీం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. తాజాగా న్యాయపరంగా చివరి అవకాశమైన క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు.
తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్ సుప్రీంను ఆశ్రయించాడు. దీనిపై మంగళవారం జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా... కొద్దిరోజుల ముందే వినయ్, ముకేశ్ క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీం కోర్టు వాటినీ కొట్టివేసింది.
ఇదీ చూడండి: భారత్‌లో వార్తల ప్రోత్సాహానికి గూగుల్ సాయం!