పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసిన నిందితులు నీరవ్ మోదీ, మెహల్ ఛోక్సీల ఆస్తుల వేలం కొనసాగుతోంది. తాజాగా వారికి చెందిన 13 విలాసవంతమైన కార్లను వేలానికి పెట్టింది ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం... రూ.3.29 కోట్లకు ఆ వాహనాలు అమ్ముడుపోయినట్లు తెలిపింది ఈడీ.
అక్రమ నగదు బదిలీ కేసులో భాగంగా వారికి చెందిన విలువైన కార్లను జప్తు చేసింది ఈడీ. కార్లను వేలం వేసేందుకు ముంబయిలోని పీఎమ్ఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానం అనుమతులు పొందింది. వేలం ప్రక్రియను మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఎస్‌టీసీ) నిర్వహించిందని ఈడీ తెలిపింది.
వేలం వేసిన 13 కార్లలో 11 నీరవ్‌మోదీ, 2 మెహల్ ఛోక్సీ గ్రూపునకు చెందినవి ఉన్నాయి. అందులో 12 వాహనాలు 3 కోట్ల 28 లక్షల 94 వేల 293 రూపాయలకు అమ్ముడయ్యాయని పేర్కొంది ఈడీ.