తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నర్సింగ్​ వృత్తిలో చేరి మీరూ అవుతారా 'నైటింగేల్‌'! - డాక్టర్​ వృత్తిలో చేరుతారా.. నర్సింగా..!

ఆసుపత్రిలో అడుగుపెడితే డాక్టర్‌ కంటే ఎక్కువగా ‘సిస్టర్‌.. సిస్టర్‌’ అనే పదమే వినపడుతుంది. అందరి అవసరాలకూ ఆమె సేవలే కావాలి. అందుకే ఆ నామస్మరణే చేస్తుంటారు. ఎంతమంది ఎలా కోరితే అలా సర్వీస్‌ చేసే ఈ నర్సులు ఎలాంటి విసుగు, విరామం లేకుండా పనిచేస్తుంటారు. అలాంటి అంకితభావంతోనే అత్యున్నత సేవలు అందించిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ చరిత్రలో నిలిచిపోయారు. ఉదాత్తమైన ఈ వృత్తిలో చేరి ప్రజల ప్రాణావసరాల్లో సేవలు చేయాలంటే కొన్ని కోర్సులు చేయాలి. నర్సింగ్‌ అంటే ఆడవారే గుర్తొచ్చినప్పటికీ మగ నర్సులకూ ఇప్పుడు డిమాండ్‌ పెరుగుతోంది.

nightingale-to-be-a-nursing-professional
నర్సింగ్​ వృత్తిలో చేరి మీరూ అవుతారా 'నైటింగేల్‌'!

By

Published : Jan 9, 2020, 9:14 AM IST

నర్సింగ్‌ విద్యలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌ లేదా ప్లస్‌ టు ఉత్తీర్ణులై ఉండాలి. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులున్నాయి. వీటిలో ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం కోర్సుల్లోకి ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా చేరవచ్ఛు బీఎస్సీ నర్సింగ్‌లోకి మాత్రం ఇంటర్‌ బైపీసీ తప్పనిసరి. ఈ మూడు కోర్సుల్లోనూ బీఎస్సీ నర్సింగ్‌ అర్హతల పరంగా పెద్దది. అందువల్ల నర్సింగ్‌ వృత్తిలో స్థిరపడాలనుకున్నవారూ, అందులో ఉన్నత విద్యను ఆశించేవారూ ఇంటర్‌లో బైపీసీ తీసుకోవడం మంచిది.

వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏపీ, తెలంగాణల్లో నర్సింగ్‌ కోర్సులు అందిస్తున్నాయి. జాతీయస్థాయిలో పేరు పొందిన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు విద్యాసంస్థలు బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రస్థాయి సంస్థల్లో కోర్సుల్లో చేరడానికి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షలు రాయనవసరం లేదు. ఇంటర్‌ మార్కులతో ప్రవేశం లభిస్తుంది. ఏపీలో గత ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను ఎంసెట్‌ ర్యాంకుతో భర్తీ చేస్తున్నారు. నర్సింగ్‌ కోర్సుల్లో చేరినవారికి ఆ ఏడాది డిసెంబరు 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండివుండాలి.

జీఎన్‌ఎం - చివరి అవకాశం

బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ప్రాధాన్యమున్న కోర్సు జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం). వ్యవధి మూడేళ్లు. నర్సింగ్‌ విద్యలో ఒకే ఎంట్రీ ఉండాలని నిర్ణయించారు. అందువల్ల జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశానికి 2020-21 విద్యా సంవత్సరం వరకే అవకాశం ఉంటుంది. అదే చివరి బ్యాచ్‌. జీఎన్‌ఎం పూర్తి చేసినవారు రెండేళ్ల వ్యవధితో పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుకోవచ్ఛు దూరవిద్యలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నుంచి మూడేళ్ల వ్యవధితో ఈ కోర్సు పూర్తిచేసుకునే అవకాశం ఉంది. పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ అనంతరం ఎమ్మెస్సీ నర్సింగ్‌లో చేరవచ్చు.

ఏఎన్‌ఎం

యాగ్జిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎం) కోర్సు వ్యవధి రెండేళ్లు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులకు అవసరమైన ప్రాథమిక వైద్యసేవలు అందించడానికి ఈ కోర్సు రూపొందించారు. వీరికి ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో అవకాశాలు లభిస్తాయి. ఏఎన్‌ఎం చదివినవారు ఆసక్తి ఉంటే జీఎన్‌ఎం, అనంతరం బీఎస్సీ పోస్టు బేసిక్‌ నర్సింగ్‌, ఆ తర్వాత ఎమ్మెస్సీ కోర్సులో చేరవచ్చు.

పీజీ స్పెషలైజేషన్లు...

వైద్యవిద్యలో ఉన్నట్లుగానే నర్సింగ్‌ పీజీలో స్పెషలైజేషన్లు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్‌ లేదా పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసినవారు ఎమ్మెస్సీ నర్సింగ్‌లో చేరడానికి అర్హులు. పీజీ కోర్సుల వ్యవధి రెండేళ్లు. పీజీ నర్సింగ్‌లో ముఖ్యంగా అయిదు స్పెషలైజేషన్లు ఉంటాయి. అవి.. మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ నర్సింగ్‌, ఆబ్సెస్టిక్స్‌ గైనకాలజీ నర్సింగ్‌, పీడియాట్రిక్స్‌ నర్సింగ్‌, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్‌, సైకియాట్రిక్‌ నర్సింగ్‌. కొన్నేళ్ల నుంచి పీజీలో నర్స్‌ ప్రాక్టీషనర్‌ కోర్సులు వివిధ విభాగాల్లో అందిస్తున్నారు. వీటిని పూర్తిచేసినవారు వైద్యులు అందుబాటులో లేనప్పుడు అత్యవసర సేవలు అందించగలరు. ఎయిమ్స్‌, ఇతర ప్రముఖ సంస్థల్లో కార్డియో థొరాసిక్‌ నర్సింగ్‌, న్యూరోసైన్స్‌ నర్సింగ్‌, ఆంకలాజికల్‌ నర్సింగ్‌, నెఫ్రలాజికల్‌ నర్సింగ్‌, క్రిటికల్‌ కేర్‌ నర్సింగ్‌, ఎమర్జెన్సీ నర్సింగ్‌, ఆపరేషన్‌ రూమ్‌ నర్సింగ్‌..ఇలా పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. ఎమ్మెస్సీ అనంతరం ఆసక్తి ఉంటే ఎంఫిల్‌ చేసుకోవచ్ఛు ఫుల్‌ టైం ఏడాది, పార్ట్‌ టైమ్‌లో రెండేళ్లకు పూర్తవుతుంది. పీహెచ్‌డీ ఉంది. దీని వ్యవధి మూడు నుంచి అయిదేళ్లు.

అవకాశాలు... వేతనాలు

బీఎస్సీ నర్సింగ్‌ చేసినవారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వేలు, జాతీయ ఆసుపత్రులు, ఇతర సంస్థల్లో లెవెల్‌ 7 ప్రకారం రూ.44,900 మూలవేతనం అందుతుంది. అంటే ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.70 వేలకు పైగా లభిస్తుంది. ఆర్మీలో లఫె్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటున్నారు. వీరికి లెవెల్‌ 10 ప్రకారం రూ.56,100 మూల వేతనం లభిస్తోంది. అన్నీ కలిపి దాదాపు లక్ష వరకు ప్రారంభ వేతనం పొందవచ్ఛు తెలుగు రాష్ట్రాల్లో వైద్య విధాన పరిషత్తుల్లో స్టాఫ్‌ నర్సు పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీరికి ప్రారంభ మూలవేతనం రూ.పాతిక వేలకు పైగా అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనం. మొదటి నెల నుంచే దాదాపు రూ.నలభై వేలు అందుకోవచ్ఛు కార్పొరేట్‌ ఆసుపత్రులు బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసినవారికి ప్రారంభంలో రూ.ఇరవై వేలకు పైగా వేతనం అందిస్తున్నాయి. పీజీ పూర్తిచేసుకున్నవారు బోధన రంగంలో మేటి అవకాశాలను అందుకోవచ్ఛు సుశిక్షితులైన నర్సులకు భారత్‌తోపాటు విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి.

మంచి అవకాశాలు.. వేతనాలు సొంతం
ఇప్పటికిప్పుడు 20 లక్షల మంది నర్సులు మన దేశానికి అవసరం. 2030 నాటికి భారత్‌కు 60 లక్షల మంది నర్సుల సేవలు తప్పనిసరి అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

బీఎస్సీ నర్సింగ్‌ కళాశాలలు

ఏపీ 150+

తెలంగాణ 80+

కోర్సు వ్యవధి 4 ఏళ్లు

టాప్‌ 5లో భారత్‌

ప్రపంచంలో ఎక్కువ మంది నర్సింగ్‌ విద్యార్థులు మన దేశంలోనే ఉన్నారు. ప్రపంచానికి నర్సులను అందిస్తోన్న టాప్‌ 5 దేశాల్లో భారత్‌ ఒకటి. గల్ఫ్‌ దేశాలు, యూఎస్‌, యూకే, మిడిల్‌ ఈస్ట్‌ల్లో నర్సులకు ఎక్కువ డిమాండ్‌ ఉంది.

ఎయిమ్స్‌ దరఖాస్తుల గడువు 16

ఎయిమ్స్​ దరఖాస్తుల గడువు 16 వరకు

ఎయిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. దరఖాస్తు చేసుకుంటే దిల్లీతో సహా 7 ఎయిమ్స్‌ కేంద్రాల్లో బీఎస్సీ నర్సింగ్‌ ఆనర్స్‌ నాలుగేళ్ల కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. మొత్తం 477 సీట్లు ఉన్నాయి. జనరల్‌, ఓబీసీలకు ఇంటర్‌లో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులు తప్పనిసరి. ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. జనవరి 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 28న పరీక్ష నిర్వహిస్తారు. వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ ఒక్కో సబ్జెక్టు నుంచి 30 చొప్పున 90 ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ నాలెడ్జ్‌ 10 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు.

అందుబాటులోని పరీక్ష కేంద్రాలు భువనేశ్వర్‌, చెన్నై, ముంబయి, బెంగళూరు. కోర్సులో చేరినవారికి రూ. 500 స్టైపెండ్‌ చెల్లిస్తారు. కోర్సు ఫీజులు నామమాత్రంగా ఉంటాయి.

(ప్రసిద్ధ కళాశాలలు; విదేశాల్లో అవకాశాలు, దూరవిద్యలో అందుబాటులో ఉన్న కోర్సులు, అడ్మిషన్ల వివరాల కోసం www.eenadupratibha.net చూడవచ్చు)

ABOUT THE AUTHOR

...view details