తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాలుష్య' నగరాల్లో బాణసంచా అమ్మకాలపై నిషేధం - ban on crackers

దిల్లీతోపాటు దేశంలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో టపాసుల విక్రయాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధం విధించింది. వాయునాణ్యత మోస్తరుగా ఉన్న ప్రాంతాల్లో హరిత టపాసుల వినియోగించవచ్చని సూచించింది. పండుగల వేళ రెండు గంటల పాటు బాణసంచా కాల్చడానికి అనుమతి ఇచ్చింది.

NGT-CRACKERS
బాణసంచా

By

Published : Nov 9, 2020, 12:00 PM IST

దేశ రాజధాని దిల్లీతో పాటు మరికొన్ని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోనూ బాణసంచా వినియోగంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆంక్షలు విధించింది. దిల్లీలో అన్ని రకాల టపాసుల అమ్మకాలపై పూర్తి స్థాయి నిషేధం విధిస్తూ జస్టిస్ ఆదర్శ్ కుమార్ నేతృత్వంలోని ఎన్​జీటీ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

గతేడాది అందుబాటులో ఉన్న డేటా ప్రకారం వాయు నాణ్యత సగటు ప్రమాదకర స్థాయిలో ఉన్న అన్ని నగరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 'మోడరేట్' స్థాయిలో ఉన్న నగరాలు, పట్టణాల్లో హరిత టపాసులను మాత్రమే అమ్మాలని పేర్కొంది.

రెండు గంటల పాటు..

పండగల వేళ రెండు గంటల (రాత్రి 8-10 గంటల మధ్య) పాటే టపాసులు కాల్చేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. నూతన సంవత్సర వేడుకల్లో మధ్యాహ్నం 12-12:30 గంటల మధ్య, గురు పూర్వ సందర్భంగా.. ఉదయం 6- 8 గంటల మధ్య బాణసంచా కాల్చడానికి అనుమతినిచ్చింది.

ఈ ఆదేశాలు సోమవారం అర్ధరాత్రి నుంచి నవంబర్ 30 వరకు అమల్లో ఉంటాయి.

కరోనా నేపథ్యంలో..

ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు విధించే అంశాన్ని స్థానిక అధికారులకే వదిలేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. కాలుష్య పరిస్థితిని పర్యవేక్షించి సంబంధిత అధికారులకు తెలపాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి, అన్ని రాష్ట్ర కాలుష్య బోర్డులకు ఆదేశాలిచ్చింది. కరోనా నేపథ్యంలో వాయు కాలుష్యం నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

ముంబయి, దిల్లీలో..

ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం బాణసంచా వాడకంపై ఆంక్షలు విధించింది. ముంబయిలోనూ బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చడాన్ని నిషేధిస్తూ అక్కడి బల్దియా ఆదేశాలు జారీ చేసింది. దీపావళి నాడు శబ్దం రాని టపాసులు కాల్చడానికి అనుమతి ఇచ్చింది.

ఇదీ చూడండి:దిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం

ABOUT THE AUTHOR

...view details