'మహా రాజకీయాల్లో మార్పు.. ప్రభుత్వం శివసేనదే' మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్నప్పటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. తాజాగా మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తోందన్నారు.
"దిల్లీ అధికారం మహారాష్ట్రలో పనిచేయదు. మహారాష్ట్ర రాజకీయాలు మహారాష్ట్రలోనే జరగాలి. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుంది. మీరు చూస్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అభ్యర్థే ఉంటారు."
-సంజయ్ రౌత్, శివసేన నేత
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో శివసేన సన్నిహితంగా వ్యవహరిస్తోందన్న వార్తలపై స్పందించారు రౌత్. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్.. మహారాష్ట్ర సీఎం కాలేరని స్పష్టం చేశారు.
మహా రాజకీయాలు
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయి భాజపా, శివసేన పార్టీలు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన మెజారిటీ సాధించాక.. రెండింటి మధ్య 'చెరిసగం సీఎం' పదవి చిచ్చు మొదలైంది. శివసేన ప్రతిపాదించిన ఈ అంశానికి భాజపా అంగీకరించలేదు. 10 రోజులుగా ఈ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
ఇదీ చూడండి:అయోధ్య కేసు తీర్పు విజయోత్సవాలపై ఆంక్షలు