కరోనాపై పోరులో రానున్న 3-4 వారాలు ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇన్ని రోజులు చేపట్టిన చర్యలకు ఫలితాలు ఆ సమయానికి బయటపడతాయని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలపాటు పొడిగించాలని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా శ్రమించినందుకే దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించినట్టు పేర్కొన్నారు మోదీ. అయితే అలసత్వం చూపించకుండా నిఘాను కట్టుదిట్టం చేయడం ఎంతో ముఖ్యమన్నారు.
కరోనాపై పోరులో 'ఆరోగ్య సేతు' యాప్ ఓ ఆయుధంగా ఉపయోగపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పర్యటించడానికి ఆరోగ్య సేతు యాప్ ఈ-పాస్‌గా వినియోగించే అవకాశముందన్నారు.