ఈ-చెత్త తెచ్చిస్తే ఇయర్‌ఫోన్స్, డేటా కేబుల్స్ ఫ్రీ మూలనపడ్డ పాత ఫోన్లు.. పనిచేయని రేడియోలు, టీవీలు.. పూర్తిగా పాడైపోయిన మిక్సీలు, హీటర్లు, రైస్ కుక్కర్లు.. అబ్బో ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇళ్లలో పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాల జాబితా చాంతాడంత ఉంటుంది. కానీ, వాటిని నిర్దాక్షిణ్యంగా పారేసేందుకు మనసొప్పదు. ఒకవేళ పారేసినా మున్సిపాలిటీవారు తీసుకెళ్లి కాల్చేస్తారు. ఫలితంగా పర్యావరణం మరింత కలుషితం అవుతుంది. అందుకే హరియాణా పంచకుల జిల్లా అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఈ-వ్యర్థాలకు బదులుగా డబ్బులిచ్చి వాటిని శాస్త్రీయ పద్ధతిలో నాశనం చేస్తున్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు వచ్చి వ్యర్థాలు ఇస్తే చాలు.. వారి వివరాలు రాసుకుని, ఆ వ్యర్థాలను కాంట్రాక్టర్లకు పంపిస్తారు. ఆ వ్యర్థాలకు తగిన డబ్బును తెచ్చిన వారి ఖాతాలో జమ చేస్తారు.
అధికారుల ఈ పర్యావరణహిత ఆలోచనకు ప్రజలు ఫిదా అవుతున్నారు. స్వచ్ఛందంగా వ్యర్థాలు తెచ్చి పర్యావరణాన్ని కాపాడుతూ.. సొమ్ము చేసుకుంటున్నారు.
"జిల్లాలో ఇప్పటికే మేము ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ పద్ధతిలో సేకరిస్తున్నాం. ఇప్పుడు విద్యుత్ పరికరాలను సేకరిస్తున్నాం. ఇందుకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశాం. సెక్టార్ 7లోని కేంద్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు బదులుగా ఇయర్‌ఫోన్స్, డేటా కేబుల్స్ ఇస్తాం. సెక్టార్ 10లో వ్యర్థాలు తీసుకుని వాటికి డబ్బులిస్తాం. శాస్త్రీయ పద్ధతిలో ఈ-వ్యర్థాలను ధ్వంసం చేసే ఓ సంస్థతో కలిసి మేము ఈ కార్యాక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఆలోచనకు భారీ ఆదరణ లభిస్తోంది."
-అర్నేల్ సింగ్, కార్యనిర్వహక అధికారి
ఇదీ చదవండి:ఈ రైలు వచ్చిందంటే పట్టాలపై మంచు క్లియర్