మహారాష్ట్రలో సీబీఐ విచారణకు వెసులుబాటు కల్పించే సమ్మతి ఉత్తర్వును ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా.. సోదాలు, దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐకి అవకాశం కల్పించిన 1989నాటి ఉత్తర్వులు ఉపసంహరించుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఇకపై మహారాష్ట్రలో సీబీఐ విచారణ జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. టీఆర్పీ రేటింగ్ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
'సీబీఐ'కి అనుమతి ఉపసంహరించిన ఠాక్రే సర్కార్ - బాలీవుడ్
కేంద్ర దర్యాప్తు సంస్థకు (సీబీఐ) ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర సర్కార్. దీంతో ఇకపై మహారాష్ట్రకు చెందిన కేసులను దర్యాప్తు చేయాలంటే సీబీఐ.. రాష్ట్ర అనుమతిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
దిల్లీ ప్రత్యేక పోలీస్ చట్టం కింద ఏర్పడిన సీబీఐ అధికార పరిధి కేవలం దేశ రాజధానికి మాత్రమే పరిమితం. ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటే ఆయా ప్రభుత్వాల సాధారణ సమ్మతి తప్పనిసరి. ఈ చట్టంలోని సెక్షన్-6 ప్రకారం..ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి మేరకే సీబీఐ సోదాలు చేపట్టాల్సి ఉంటుంది. సీబీఐకి సాధారణ సమ్మతి ఉపసంహరించినా కేసుల తీవ్రత ఆధారంగా ప్రభుత్వం అనుమతి ఇస్తుందని మహారాష్ట్ర అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాజస్థాన్, బంగాల్ సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోగా తాజాగా ఈ జాబితాలోకి మహారాష్ట్ర కూడా చేరింది.
ఇదీ చూడండి:టీఆర్పీ అవకతవకల కేసు సీబీఐకి బదిలీ