2020 బిహార్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచీ పార్టీలు గెలుపే లక్ష్యంగా కసరత్తులు మొదలుపెట్టాయి. ఈసారి ప్రధాన పోటీ భాజపా-జేడీయూ సారథ్యంలోని ఎన్డీఏ.. ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్షాల మహాకూటమి మధ్యేనని అంతా బలంగా విశ్వసిస్తున్నారు.
ఇదే సమయంలో బిహార్ గడ్డపై సత్తా చాటేందుకు కొత్త పార్టీలతో సహా చాలా పార్టీలు ఊవిళ్లూరుతున్నాయి. వీటిలో ఇప్పటివరకు అక్కడ కొన్ని సీట్లతోనే సంతృప్తి చెందుతోన్న వామపక్షాలు కూడా ఉన్నాయి. జన్ అధికార్ పార్టీ, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ, జనతా దళ్ (రాష్ట్రవాది) పార్టీ, జనతాంత్రిక్ వికాస్ పార్టీలతో సహా అనేక పార్టీలు గెలుపు రుచి చూడాలని తాపత్రయపడుతున్నాయి.
పప్పూ యాదవ్ సత్తా చాటేనా?
ఆర్జేడీ నుంచి బయటకు వచ్చి వేరుకుంపటి పెట్టుకున్నారు మాజీ ఎంపీ పప్పూ యాదవ్. ఆయన సారథ్యంలోని జన్ అధికార్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. మాస్ లీడర్‌గా బిహారీల్లో గుర్తింపు కలిగిన పప్పూ యాదవ్.. గత ఐదేళ్లలో తమ పార్టీ ప్రజల్లో ఆదరణ సంపాదించిందని చెబుతున్నారు. అయితే.. ఈ ఆదరణ ఎంతమేరకు ఓట్లు రాలుస్తుందనేది వేచి చూడాలి.
బిహార్ ప్రజలు అధికార-ప్రతిపక్షాలతో విసిగిపోయి ఉన్నారని చెబుతున్నారు పప్పూయాదవ్. ప్రత్యామ్నాయం తమ పార్టీనే అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. పార్టీకి బక్సర్, భోజ్‌పూర్, రోహ్తాస్ జిల్లాల్లో విజయఢంకా మోగిస్తామని విశ్వాసంగా చెబుతున్నారు. కరోనా కట్టడి చర్యలపై అధికారపక్షాన్ని తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు.
బరిలో బీఎస్పీ
బిహార్‌లో క్షేత్రస్థాయిలో పెద్దగా పట్టులేని బీఎస్పీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించింది. మహాకూటమిలో చేరే ప్రసక్తే లేదని చెబుతోంది.
50 స్థానాల్లో ఎంఐఎం
ఎంఐఎం పార్టీ కూడా 50 స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే తాము పోటీ చేసే స్థానాలను గుర్తించింది. అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది.
బిహార్ ప్లూరల్స్ పార్టీ
బిహార్ ప్లూరల్స్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మాజీ జేడీయూ నేత వినోద్ చౌదరి కూమార్తె పుష్పం ప్రియా చౌదరి.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. లండన్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న పుష్పం.. వ్యవస్థలో మార్పులు తీసుకురావటమే తమ లక్ష్యమంటున్నారు. నేరారోపణలు లేని అభ్యర్థులను పోటీలో నిలబెడుతున్నారు.
మరో జనతా దళ్ పోటీ..
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు, మాజీ ఎంపీ రంజన్ యాదవ్.. జనతాదళ్ (నేషనల్) పార్టీతో ముందుకొచ్చారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడుతున్న ఈ పార్టీ.. భావసారుప్యత కలిగిన పార్టీలతో కలిసి ముందుకెళ్తామని ప్రకటించింది.
ఇదీ చూడండి:బిహార్‌లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
బిహార్‌లో వామపక్షాలు
వామపక్షాలు బిహార్‌లో అంత ఆశాజకమైన పరిస్థితులు కనిపించటం లేదు. గత ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కూటమితో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు లెఫ్ట్ నేతలు. అయితే, సీట్లు సర్దుబాటు విషయంలో సయోధ్య కుదరటంలేదు.
ఉత్సాహంగా యూడీఎస్ఏ
మాజీ కేంద్ర మంత్రి, యునైటెడ్ డెమొక్రటిక్ సెక్యులర్ అలయన్స్ కన్వీనర్ దేవేంద్ర ప్రసాద్ యాదవ్ సైతం బిహార్ బరిలో నిలబడ్డారు. 150 శాసనసభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది యూడీఎస్ఏ. రాష్ట్రీయ అధికార్ పార్టీ, సంయుక్త కిసాన్ వికాస్ పార్టీలతో కలిసి కొత్త కూటమిగా పోటీ చేస్తోంది.