ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యం.. పార్లమెంటు భవనం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా.. దేశ రాజధాని దిల్లీ నడిబొడ్డున ఉన్న పార్లమెంటు భవనం స్థానంలో నూతనంగా అధునాతన భవనాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్లో నిర్మాణం ప్రారంభించి.. రెండేళ్లలో పూర్తిచేయనున్నారు. 2022 అక్టోబర్ నాటికి కట్టడం పూర్తిచేయాలని డెడ్లైన్ పెట్టింది ప్రభుత్వం. అయితే ఈ సమయంలోనూ పార్లమెంటు సమావేశాలు, విధులు యథావిథిగానే కొనసాగుతాయని లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం స్పష్టం చేసింది. డిసెంబర్లో జరగనున్న భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇరుసభల్లోని రాజకీయ నేతలు భాగం కానున్నారు.
888 మంది కూర్చునేందుకు వీలు..
నూతన భవనంలోని లోక్‌సభ ఛాంబర్లో 888 మంది కూర్చునేందుకు వీలుంటుంది. ఇందులో 384 సీట్లు రాజ్యసభ సభ్యుల కోసం కేటాయించారు. లోక్‌సభ నియోజకవర్గాలను పునర్‌వ్యవస్థీకరిస్తే కొత్తగా వచ్చే సభ్యులకు ప్రస్తుత భవనం సరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లోక్సభలో 543 మంది.. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు.
నూతన భవంతి నిర్మాణం సమయంలో గాలి, ధ్వని కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఎంపీకి ప్రత్యేకమైన ఆఫీస్ కేటాయించడమే కాకుండా వారికి ప్రత్యేకమైన డిజిటల్ సాంకేతికతతో ఏర్పాట్లు చేయనున్నారు. పూర్తిగా పేపర్లెస్ ఆఫీసులుగా మార్చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో నిర్మిస్తారని తెలుస్తోంది. ఇందులో భారత ప్రజాస్వామ్య సంస్కృతి ప్రతిబింబించేలా.. భారీ హాల్ ఉండనుంది. పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, ఓ లైబ్రరీ, కమిటీలకు ప్రత్యేకమైన గదులు, భోజన ప్రదేశాలు, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు.